ఢిల్లీ లిక్కర్ కేసు.. కవితకు మరింత కష్టాలు.. ఇంకెన్నాళ్లు జైల్లోనో?
వినోద్ కు కవిత 25 కోట్ల రూపాయలను బదలాయించినట్లు తాజాగా నిర్ధారించడం కీలకంగా మారింది. కవిత మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.
By: Tupaki Desk | 19 Jun 2024 12:01 PM GMTమార్చి 16.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన రోజు. ఇప్పటికి మూడు నెలలు దాటింది. అప్పటినుంచి జైల్లోనే ఉంటోంది. ఈ నెల చివరకు కూడా ఆమె బయటకు వచ్చే అవకాశాలు లేదు. ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి బయటకు వచ్చి, మళ్లీ లోపలకు వెళ్లారు. కవిత మాత్రం బెయిల్ పొందలేకపోయారు. మరోవైపు తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అది కవితకు సంబంధించినదే కావడం గమనార్హం. దీంతో కవిత మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటోన్న కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీ గడువు బుధవారంతో ముగిసింది. దీంతో జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను రోస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. మరో 10 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది.
2022 నాటి గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత నుంచి 25 కోట్ల రూపాయలను వినోద్ చౌహాన్ అనే వ్యక్తి అందుకున్నాడని, అభిషేక్ బోయిన్ పల్లి ద్వారా కవిత పీఏ ఈ మొత్తాన్ని హవాలా రూపంలో బదలాయించినట్లు ఈడీ న్యాయవాది కోర్టుకు వివరించారు. వినోద్ ను అరెస్ట్ చేసి, వివిధ సెక్షన్ల కింద కేసులను నమోదు చేశామన్నారు. దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా కేజ్రీ, వినోద్ కు బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.వాదనల అనంతరం కేజ్రీ, వినోద్ ల జ్యుడీషియల్ కస్టడీని జూలై 3వ తేదీ వరకు పొడిగించింది.
కాగా, ఇదే కేసులో అరెస్టయిన కవిత కూడా ఈడీ, సీబీఐ అదుపులో ఉన్నారు. తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. కవిత కస్టడీని కూడా రోస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది.
వినోద్ కు కవిత 25 కోట్ల రూపాయలను బదలాయించినట్లు తాజాగా నిర్ధారించడం కీలకంగా మారింది. కవిత మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది.
కాగా, కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొంది.