Begin typing your search above and press return to search.

టీ-కాంగ్రెస్ నేత‌ల నోటికి తాళం వేసిన కే-కాంగ్రెస్ నేత‌లు!

మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు(టీ-కాంగ్రెస్‌), క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత‌ల‌ను(కే-కాంగ్రెస్‌) ఉద‌హ‌రిస్తూ.. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అవ‌కాశం ఉన్న చోట‌ల్లా దంచి కొడుతున్నారు.

By:  Tupaki Desk   |   5 Nov 2023 1:30 AM GMT
టీ-కాంగ్రెస్ నేత‌ల నోటికి తాళం వేసిన కే-కాంగ్రెస్ నేత‌లు!
X

"క‌ర్ణాట‌క‌లో మా ప్ర‌భుత్వాన్ని చూడండి. ఈ ఏడాది మేలో ఏర్పాటైంది. ఎంత స‌జావుగా పాల‌న చేస్తోందో ఒక్క‌సారి వెళ్లిరండి. ఎన్నిక‌ల స‌మ‌యంలో మేం ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ చెబుతున్న‌ట్టు ముఖ్య‌మంత్రుల విష‌యంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా స‌మీక‌ర‌ణ‌లు చేశాం. ఇదీ మా విధానం"- కొన్ని రోజుల కింద‌ట కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ స్వ‌యంగా చేసిన ప్ర‌క‌ట‌న ఇది. ఇక‌, తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు కూడా త‌ర‌చుగా క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ పాల‌న‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తామ‌ని చెబుతున్నారు. ముఖ్య‌మంత్రుల విష‌యాన్ని అధిష్టానం చూసుకుంటుంద‌ని కూడా అంటున్నారు.

మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు(టీ-కాంగ్రెస్‌), క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత‌ల‌ను(కే-కాంగ్రెస్‌) ఉద‌హ‌రిస్తూ.. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అవ‌కాశం ఉన్న చోట‌ల్లా దంచి కొడుతున్నారు. క‌ట్ చేస్తే.. తాజాగా ఇదే కే-కాంగ్రెస్‌లో ఉప‌ద్ర‌వం ఏర్ప‌డింది. ముఖ్యం గా సీఎం సీటువ్య‌వ‌హారం దావాల‌నం అనేలా వివాదం సృష్టించింది. ప‌థ‌కాలు, గ్యారెంటీల స్థానంలో ముఖ్య‌మంత్రి పీఠంపై నాయ‌కులు జుట్టు జుట్టు ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ ఏడాది మేలో జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో 135 స్థానాల‌తో కాంగ్రెస్ వియం ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో పార్టీ గెలుపున‌కు కృషి చేసిన సిద్ద‌రామ‌య్య‌, కే-పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్‌ల మ‌ధ్య సీఎం సీటు ర‌గ‌డ‌గా మారింది.

దీనిపై అనేక చ‌ర్చ‌లు, బుజ్జ‌గింపుల త‌ర్వాత‌..ఎట్ట‌కేల‌కు ఒక ఫార్ములా ప్ర‌కారం సిద్ద‌రామ‌య్య‌-డీకేల‌ను అధిష్టానం ఒప్పించింది. దీని ప్ర‌కారం చెరో రెండున్న‌రేళ్లు సీఎం సీటును పంచుకోవాల్సి ఉంది. కానీ, తాజాగా సిద్ద‌రామ‌య్య‌.. తానే ఐదేళ్లు పాలిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంట‌నే డీకే వ‌ర్గం..అస‌లు నువ్వు సీఎంగా ఏ చేశావ‌ని..త‌క్ష‌ణం రాజీనామా చేసి సీటును డీకేకు ఇవ్వాల‌ని నిర‌స‌న‌లు, నినాదాల‌తో పార్టీ కార్య‌క్ర‌మాల్లో హోరెత్తిస్తున్నారు. ఇదిలావుంటే.. సీఎం సీటు కోసం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత జాతీయ అధ్య‌క్షుడు ఖ‌ర్గే కుమారుడు ప్రియాంక్ కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, మ‌రో మంత్రి కూడా దీనిపై క‌న్నేశారు. మొత్తంగా గ‌త రెండుమూడు రోజులుగా క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో సీఎం సీటు విష‌యం త‌ప్ప‌.. మ‌రో ప్ర‌స్తావ‌న లేకుండా పోయింది.

ఇదే విష‌యం ఇప్పుడు తెలంగాణ‌లోనూ రిఫ్లెక్ట్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా అధికార బీఆర్ ఎస్ పార్టీ.. కాంగ్రెస్ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ.. ముఖ్య‌మంత్రులు చాలా మంది ఉన్నారు.. ప్ర‌జ‌లే వారి వెంట లేరు.. అంటూ కేటీఆర్ వంటి వారు స‌టైర్లు వేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. క‌ర్ణాట‌క‌లో మాదిరిగా సీఎం సీటు కోసం కొట్టుకుంటార‌నే వాద‌న‌ను బీఆర్ ఎస్ తెర‌పైకి తీసుకువ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. బ‌హుశ ఈ విష‌యాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన కాంగ్రెస్ నేత‌లు.. క‌ర్ణాట‌క కాంగ్రెస్ వ్య‌వ‌హారాల‌ను ప్ర‌స్తావించ‌డం మానేశారు. ఇదీ.. సంగ‌తి!