మణిపూర్ హింసపై జాతీయ పార్టీ అధినేత కేసీఆర్ నోరు విప్పరా?
ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మారిస్తే సరిపోదు
By: Tupaki Desk | 22 July 2023 4:32 AM GMTప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మారిస్తే సరిపోదు. అందుకుతగ్గట్లు చేతలు ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇప్పుడు హాట్ చర్చగా మారింది. యావత్ దేశం మణిపూర్ హింస.. గిరిజన యువతులపై సాగిన అమానుష హాత్యాచారంపై భగ్గుమంటోంది. ఇలాంటి సీరియస్ అంశంపై జాతీయ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడకపోవటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
కొన్ని సందర్భాల్లో.. కొన్ని అంశాలపై సీరియస్ గా స్పందించే కేసీఆర్.. మణిపూర్ హింసపై మౌనాన్ని పలువురు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆ మధ్యన ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మోడీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేయటం తగ్గించేశారు. ఇప్పటికే ఇదే అంశంపై బోలెడన్ని ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత ఇరుక్కున్నారని.. అయితే.. ఢిల్లీ పెద్దలతో తెర వెనుక రాజీ చేసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపించటం తెలిసిందే. దీనికి ముందు.. ఈ కేసుపై ఈడీ నానా హడావుడి చేయటం.. ఆ తర్వాత ఆ ఊసే లేనట్లుగా వ్యవహరించటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. అప్పటివరకు ఎంతో చైతన్యంతో పని చేసిన ఈడీ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఏమిటి? ఆ అంశంపై ఈడీ పయనం ఎలా సాగుతుందన్న విషయంపై బోలెడన్ని ప్రశ్నలే తప్పించి.. సమాధానాలు రాని పరిస్థితి.
తెలంగాణ అధికారపక్షానికి.. బీజేపీ అధినాయకత్వానికి మధ్య ఒప్పందం కుదిరిందని.. మరో నాలుగు నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. అందుకు అవసరమైన సాయం చేస్తామంటూ బీజేపీ పెద్దలు గులాబీ బాస్ తో ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీన్ని ఇరు పార్టీలు తీవ్రంగా ఖండించినప్పటికీ.. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో కేంద్రం మీద కేసీఆర్ ఎలాంటి ఘాటు పంచ్ లు వేయకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక జాతీయ పార్టీ అధినేతగా మణిపూర్ హింసపై స్పందించాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉంది. కానీ.. ఆ అంశంపై ఇప్పటివరకు గులాబీ బాస్ మాట్లాడింది లేదు. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయ చట్టాల వేళ.. విపక్షాల నిరసన తర్వాత అంతలా చిక్కుకుపోయిన ఉదంతం మణిపూర్ హింస. అలాంటి సబ్జెక్టుపై కేసీఆర్ మాట్లాడితే.. ఆ లెక్కే వేరుగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
అయితే.. ఈ అంశంపై మౌనంగా ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏమైనా.. జాతీయ పార్టీ అధినేతగా దేశాన్ని కుదిపేసిన ఒక ఉదంతంపై మాట్లాడకుండా ఉండటం తర్వాతి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.