Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కాంగ్రెస్ ఝలక్.. జీతం ఇవ్వొద్దని స్పీకర్ కు ఫిర్యాదు

ఇంతకుముందు కూడా, అసెంబ్లీకి హాజరుకాకపోవడం నేపథ్యంలో, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపింది.

By:  Tupaki Desk   |   11 March 2025 6:26 PM IST
కేసీఆర్ కు కాంగ్రెస్ ఝలక్.. జీతం ఇవ్వొద్దని స్పీకర్ కు ఫిర్యాదు
X

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా జీతం తీసుకోవడం సరికాదని, ఆయనకు చెల్లించే వేతనాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజా ప్రయోజనాల కోసం నిలబడాల్సిన కేసీఆర్, అసెంబ్లీలో పాల్గొనకుండానే జీతభత్యాలు పొందుతున్నారని కాంగ్రెస్ నాయకులు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు, అసెంబ్లీ సెక్రటరీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అదేవిధంగా, గత 14 నెలలుగా అసెంబ్లీలో పాల్గొనకపోయినా, ఆయనకు జీతం చెల్లించడాన్ని అనైతికమని పేర్కొంటూ, ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం జీతాన్ని తిరిగి వసూలు చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ రూ.4,21,000 వేతనం పొందారు. ప్రస్తుతం, తెలంగాణ శాసనసభ్యులకు నెలకు రూ.2,50,000 వేతనం అందించబడుతోంది.

ఇంతకుముందు కూడా, అసెంబ్లీకి హాజరుకాకపోవడం నేపథ్యంలో, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఈ నోటీసులను న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని కారణంగా, కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ్‌పాల్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వర్తించని కేసీఆర్‌కు సభ్యుడిగా కొనసాగేందుకు అర్హత లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, లేకపోతే వెంటనే ప్రతిపక్ష నేత పదవి నుండి తొలగించాలని నోటీసులో తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. కానీ, కాలుజారి పడటంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత పూర్తిగా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. ఇప్పటివరకు ఒకే ఒక్కసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలుమార్లు అసెంబ్లీలో హాజరుకావాలని కోరినా, ఆయన స్పందించలేదు. అయితే, ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.