Begin typing your search above and press return to search.

కేసీఆర్ మళ్లీ డుమ్మా.. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ

ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మరోసారి డుమ్మా కొట్టారు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 11:12 AM GMT
కేసీఆర్ మళ్లీ డుమ్మా.. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ
X

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రోజురోజుకూ భగ్గుమనేలా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మరోసారి డుమ్మా కొట్టారు. ఇప్పుడు దీనిపై రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తిచేసుకుంది. పదేళ్లపాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు పాలించారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి గులాబీ పార్టీనే అధికారంలో కొనసాగింది. దాంతో రెండు పర్యాయాలు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆరే బాధ్యతలు చేపట్టారు. పదేళ్ల పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీకి చేదు ఫలితాలను ఇచ్చారు. దాంతో అధికారంలో కోల్పోయి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషించాల్సి వచ్చింది.

అయితే.. ప్రజాతీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన బీఆర్ఎస్ అధినేత, మాజీముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు ముఖం చాటేస్తున్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఫాంహౌజ్‌కే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అప్పీల్ చేశారు. సీనియర్ నాయకుడైన మీరు అసెంబ్లీకి వచ్చి తమకు సూచనలు ఇవ్వాలని.. తమ పాలనను ముందుకు నడిపించాలని కోరారు. విలువైన సూచనలతో ప్రజల సమస్యలను మరింత దూరం చేయొచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీ రండి.. వచ్చి మమ్మల్ని ఇరుకున పెట్టండి.. నిలదీయండి అని కూడా కోరారు. కానీ.. కేసీఆర్ మాత్రం ఎప్పటిలాగే.. ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో కనిపించలేదు.

ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చూస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వచ్చాయి. అందుకే కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదని అన్నారు. మరి.. కాంగ్రెస్ కొలువుదీరి కూడా ఏడాది సమయం గడిచింది. ఇప్పటికి కూడా ఎందుకు రావడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏడాది కాలంలో బడ్జెట్ సమావేశాల వేళ ఒక్క రోజు మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. అది కూడా చుట్టపుచూపుగా అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి ఇటు అసెంబ్లీకి కానీ.. అటు ప్రజల్లోకి కానీ రావడం లేదు.

తాజాగా.. అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై కీలక చర్చ పెట్టారు. ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయో అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై జోరుగా చర్చ మొదలైంది. మరోవైపు.. కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి వస్తారా..? ఎప్పుడు దుమ్మదులుపుదామా అన్నట్లుగా రేవంత్ ఎదురుచూస్తున్నట్లు అర్థమవుతోంది. కానీ రేవంత్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా ఆ చాన్స్ ఇవ్వలేదు. ముందుముందు కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉంది.