'కల్యాణం.. కమనీయం..' దండలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు
మరోవైపు పుట్టిన రోజు అయినప్పటికీ ఆయన సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. భార్య శోభతో కలిసి పాల్గొన్నారు.
By: Tupaki Desk | 17 Feb 2025 11:54 AM GMTతెలంగాణ సాధనలో అలుపెరగని సారథి కేసీఆర్. కనీసం ఊహకు కూడా సాధ్యం కాని దశలో తెలంగానం అందుకుని ఉద్యమ పథంలో ముందుకుసాగారు కేసీఆర్. 13 ఏళ్ల పాటు ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నా తన ఆశయాన్ని వీడకుండా పట్టుదల కనబరిచారు. చివరికి 2014లో తెలంగాణను సాధించడమే కాక.. పదేళ్లు ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.
ఫిబ్రవరి 17 కేసీఆర్ జన్మదినం. ఆయన 1954లో పుట్టారు. 72వ ఏట అడుగుపెట్టారు. కాగా, కేసీఆర్ స్వస్థలం సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామం. ఇక్కడి పీఏసీఎస్ (ప్రాథమిక సహకార పరపతి సంఘం) నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1983లో టీడీపీ తరఫున సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓడిన ఆయన 1985లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటినుంచి వెనక్కుతిరిగి చూసుకోలేదు.
1989,1994,1999, 2001 (టీఆర్ఎస్ తరఫున ఉప ఎన్నికలు), 2004లో సిద్దిపేట నుంచి గెలుపొందారు. 2014, 2018, 2023లో గజ్వేల్ నుంచి విజయం సాధించారు. అయితే, 2023లో కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోవడం కేసీఆర్ కెరీర్ లో కేవలం రెండో ఓటమి. ఎంపీగా కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ నుంచి గెలిచిన ఆయన తెలంగాణ వచ్చాక మళ్లీ పార్లమెంటుకు పోటీ చేయలేదు. మొత్తమ్మీద 9 సార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు ఎంపీగా నెగ్గారు.
కేసీఆర్ కు చిన్న వయసులోనే శోభతో వివాహమైంది. వీరికి కె.తారక రామారావు, కవిత పిల్లలు అనే సంగతి తెలిసిందే. కాగా, జన్మదినోత్సం సందర్భంగా కేసీఆర్ కు సోమవారం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు పుట్టిన రోజు అయినప్పటికీ ఆయన సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. భార్య శోభతో కలిసి పాల్గొన్నారు. దీంతొ కేసీఆర్ దంపతులు ఆ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేసీఆర్ పుట్టినరోజు కావడంతో పెళ్లి వేదిక వద్ద అతిథులు ప్రత్యేకంగా వేడుకను ఏర్పాటు చేశారు. వధూవరులు, అతిథుల సమక్షంలో కేసీఆర్ దంపతులు పూలదండలు అలంకరించుకున్నారు. ఉంగరాలు మార్చుకుని మధుర క్షణాలను ఆస్వాదించారు. వివాహానికి విచ్చేసిన అతిథులు, కుటుంబసభ్యులు ఈ అందమైన ఘట్టాన్ని ఆనందంగా వీక్షించారు. ఈ సంఘటన పెళ్లి వేడుకను మరింత ఆకర్షీణయం చేసింది. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.