కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. హీట్ మొదలైంది..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లాంటి నేతలు సభలో ఉన్నా, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతుండడం అసెంబ్లీ దిశను మార్చవచ్చని అంటున్నారు.
By: Tupaki Desk | 12 March 2025 1:37 AM IST60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన ఉద్యమ సేనాని.. ఉమ్మడి ఏపీలో ఉద్దండులు అయిన వైఎస్ఆర్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్ లాంటి గండర గండరులను ఎదుర్కొని నిలిచి గెలిచి తెలంగాణ సాధించిన మేధావి. తెలంగాణ ప్రజల్లో ఓరకమైన సెంటిమెంట్ కేసీఆర్ పట్ల ఉంది.అయితే చాలా రోజులుగా ప్రజల్లోకి రాకుండా కాంగ్రెస్ను విమర్శించకుండా ఫాంహౌస్ కు పరిమితమైన కేసీఆర్ పై అంతే స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలు పట్టవా? ఇదేనా? రాజకీయం అంటూ విమర్శలొస్తున్నాయి. అందుకే కాబోలు కేసీఆర్ బయటకొచ్చారు. ఈ అసెంబ్లీకి వస్తారన్న ప్రచారం మొదలైంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ మొదలైంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు హోరాహోరీగా సాగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత అయిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అసెంబ్లీకి హాజరు కాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు సభలో ఎదురులేని కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ వస్తే ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు లాంటి నేతలు సభలో ఉన్నా, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతుండడం అసెంబ్లీ దిశను మార్చవచ్చని అంటున్నారు. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, ఉద్యమ నాయకుడిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా కేసీఆర్‌కు ఉన్న అనుభవం, అధికార పక్షానికి గట్టి సవాలుగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కారును నిలువరించే సత్తా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత ఇప్పుడు సభకు వస్తుండటంతో, ప్రభుత్వానికి ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు అధికార పక్షం సభలో ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలు అడ్డుకట్ట లేకుండా ఆమోదం పొందడం కష్టమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన సభా నియమావళిపై లోతైన అవగాహన కలిగిన నేత కావడంతో, అధికార పక్షం తన అనుకూలంగా సభను నడిపించడం అంత సులభం కాకపోవచ్చు.
కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ సమావేశాలకు హాజరవాలని నిర్ణయించుకున్నారు. చాలా కాలంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎరవల్లి ఫాం హౌస్‌లో గడిపిన ఆయన, ఇటీవలే హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. కేసీఆర్ రాకతో పార్టీ కార్యాలయానికి ప్రత్యేక ఊపొచ్చినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే ఉత్సాహంతో బుధవారం కేసీఆర్ అసెంబ్లీకి రానుండటంతో సభలో రాజకీయ వేడి పెరగడం ఖాయమని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ఎలా ప్రశ్నిస్తారనే అంశంపై అందరి దృష్టి నిలిచింది. మొత్తంగా, ఈ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నట్లు స్పష్టమవుతోంది.