Begin typing your search above and press return to search.

కేసీఆర్ కార్యాచరణ... జనంలోకి వచ్చేది ఎప్పుడు అంటే..?

బలమైన కార్యాచరణతోనే ప్రజల్లోకి వచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Oct 2024 9:30 AM GMT
కేసీఆర్ కార్యాచరణ... జనంలోకి వచ్చేది ఎప్పుడు అంటే..?
X

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌజ్‌ను వీడి ప్రజల్లోకి రాబోతున్నారా..? ఇందుకు పెద్ద కార్యాచరణ సిద్ధమైందా..? ఇప్పటికే నాయకత్వంతో పూర్తిస్థాయి చర్చలు కూడా పూర్తయ్యాయా..? మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన పోరుబాట పట్టబోతున్నారా..? ప్రభుత్వాన్ని ప్రశ్నలతో సతమతం చేసేందుకు కత్తులు నూరుతున్నారా..? అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

గత పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో గత డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల వచ్చాయి. అడపాదడపా కేసీఆర్ ప్రచారం పాల్గొన్నారు. బహిరంగ సభల్లో పాల్గొని అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో అప్పటి నుంచి కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు.

గత కొన్ని నెలలుగా కేసీఆర్ ఫాంహౌజ్‌ను వీడి బయటకు రాలేదు. దీంతో అధికార పక్షం కూడా కేసీఆర్ వైఖరిని చాలాసార్లు తప్పుబట్టింది. ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారంటూ పలురకాల విమర్శలు చేసింది. ప్రధాప ప్రతిపక్షం పాత్ర ఇస్తే కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. అటు బీజేపీ నేతలు కూడా కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు. అయితే.. ఫాంహౌజ్‌ను వేదికగా చేసుకునే తన భవిష్యత్ కార్యాచరణ జరుగుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. అక్కడే ఉండి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల ఇబ్బందులను ఆయన తెలుసుకుంటున్నారని సమాచారం. అందుకే.. బలమైన కార్యాచరణతోనే ప్రజల్లోకి వచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై కేటీఆర్, హరీశ్ మాత్రమే పోరాడుతున్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ విమర్శలపైనా ప్రతివిమర్శలు చేస్తూ తగ్గేదేలే అంటూ పార్టీని నడిపిస్తున్నారు. నిత్యం పార్టీ కేడర్‌లో నమ్మకం కోల్పోకుండా.. యాక్టివ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ అందరికీ అందలేదని అపవాదు ఉంది. దాంతో చాలా చోట్ల నిరసనలు పెల్లుబికాయి. కొంత మంది రైతులు ఆత్మహత్యాయత్నం వరకు కూడా వెళ్లారు. కానీ.. కేసీఆర్ నుంచి మాత్రం ఒక్క స్టేట్‌మెంట్ కూడా రాలేదు.

మరోవైపు.. హైదరాబాద్ నగరంలో హైడ్రా సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. అక్రమ కట్టడాలను ఇప్పటికే వందలాది సంఖ్యలో నేలమట్టం చేసింది. ఇక మూసీ సుందరీకరణ పేరుతోనూ అక్కడి ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు. వారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చూపించింది. అయితే.. కొంద మంది నిర్వాసితులు ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ.. కొంత మంది మాత్రం తాము వెళ్లబోమని చెప్పారు. పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. ప్రభుత్వ తీరును నిలదీశారు. ఆ సమయంలోనూ కేసీఆర్ స్పందించలేదు. వారి కోసం ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అటు భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఆగమైనా కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనకు రాలేదు. దాంతో ప్రజల్లో ఒకింత ఆయనపై వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ కేడర్ భావించింది.

దాంతో వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ కొలువుదీరి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కేసీఆర్ జనాల్లోకి వస్తున్నారనే గుసగుసలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కేసీఆర్ సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ నేతలకు హింట్ ఇచ్చినట్లుగానూ తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఇలా వివిధ వర్గాల ప్రజల సమస్యలపై పోరాడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూడా ప్రభుత్వ వైఫల్యాలతోనే ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీని బలోపేతం చేయడంపైనా కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. అందులో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గాలు, జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలను సైతం త్వరలో వేయబోతున్నట్లు తెలుస్తోంది.