Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఖేల్ ఖతం.. కేసీఆర్ లో ఆ భయం పోయినట్లేనా?

15 నెలలుగా రాజకీయ అజ్ఞాతంలో గడుపుతున్న ఆయన ఇక కార్యక్షేత్రంలోకి దిగనున్నట్లు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   8 March 2025 12:20 PM IST
కాంగ్రెస్ ఖేల్ ఖతం.. కేసీఆర్ లో ఆ భయం పోయినట్లేనా?
X

వేసవి ఎండలతోపాటు తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్సీ పోరు ముగిసి స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 15 నెలలుగా రాజకీయ అజ్ఞాతంలో గడుపుతున్న ఆయన ఇక కార్యక్షేత్రంలోకి దిగనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ఖేల్ ఖతమైందని.. ఇక అధికార పార్టీపై సమర శంఖం పూరించడమే బ్యాలెన్స్ అంటూ కేసీఆర్ హెచ్చరించడం బీఆర్ఎస్ కేడర్లో జోష్ తెప్పిస్తోంది.

ఎప్పుడెప్పుడా అంటూ తమ అధినేత కోసం ఎదురుచూస్తున్న గులాబీదళం ఒకవైపు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తేనే తమలో కసిపెరుగుతుందని చూస్తున్న కాంగ్రెస్ మరోవైపు.. రెండు పక్షాలను చిత్తు చేసి తమ ఆధిక్యం ప్రదర్శించాలని బీజేపీ ఇంకోవైపు మోహరించడంతో తెలంగాణ రంగస్థలంలో రాజకీయ క్రీడ రక్తికడుతోంది.

15 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చెబుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన ఆరు నెలల నుంచే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావు ప్రజాక్షేత్రంలో అలుపులేకుండా తిరుగుతున్నా, ఆ పార్టీకి పెద్దగా మైలేజ్ పెంచలేకపోయారనే వాదన ఉంది. గులాబీ దళపతి కేసీఆర్ బయటకు వస్తేనే పరిస్థితలో మార్పు వస్తుందని ఆ పార్టీ కేడర్ కూడా అభిప్రాయపడుతోంది.

అయితే ఎవరు ఎన్నివిధాలా అభ్యర్థించినా, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం 15 నెలలుగా రాజకీయ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే బయటకు వచ్చిన కేసీఆర్ ఈ 15 నెలలు ఎర్రవల్లిలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రానికే పరిమితయ్యారు. అయితే కేసీఆర్ ను కలిసేందుకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అక్కడికే వెళుతుండటంతో వ్యవసాయ క్షేత్రమే కేసీఆర్ కార్యక్షేత్రంగా మారిపోయింది. ఆయన ఎర్రవల్లి నుంచే దిశానిర్దేశం చేస్తున్నా.. అధికార పార్టీ బలం ముందు బీఆర్ఎస్ కేడర్ తేలిపోతోంది.

మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేవరకు తాను బయటకు రాకూడదని భావించిన కేసీఆర్ తగిన సమయం కోసం ఎదురుచూడాలని భావించారు. అందుకే కొన్ని రకాల ముఖ్యకార్యక్రమాలకు ఆయన హాజరుకాలేదు. అసెంబ్లీ సమావేశాలను సైతం ఆయన పట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత రాకముందే తాను బయటకు వస్తే కాంగ్రెస్ అలర్ట్ అయ్యే అవకాశం ఉందని, దీంతో ఆ పార్టీకి మళ్లీ పుంజుకునే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఆయన ఆలోచించారని అంటున్నారు.

ప్రజల నుంచి పూర్తిగా తిరస్కారం ఎదురైన తర్వాత తాను రంగంలోకి దిగితే, కాంగ్రెస్ మళ్లీ లేవలేని విధంగా దెబ్బతీయాలని ఆయన వ్యూహాత్మక మౌనం పాటించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటమి ఎదురవడంతో తన అంచనాలు నిజమవుతున్నాయని భావిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు అజ్ఞాతం వీడాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అందుకే వచ్చే బడ్జెట్ సమావేశాలకు హాజరై కాంగ్రెస్ గ్యారెంటీ హామీల గుట్టు విప్పాలని చూస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా వచ్చే నెలలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సదస్సును ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన తన విదేశీ పర్యటనను సైతం వాయిదా వేసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

మొత్తానికి కేసీఆర్ పునరాగమనంతో తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నాళ్లు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీది పైచేయిగా కనిపించేది అంటున్నారు. మరోవైపు 15 నెలల పాలనలో కాంగ్రెస్ చేపట్టిన పథకాలను చెప్పుకోలేక ప్రజాక్షేత్రంలో చతికిలపడుతోందని తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయంటున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం ఆ ఎన్నికలకు దూరంగా ఉండటంతో బీజేపీ పుంజుకుంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో బీజేపీ కూడా తెలంగాణలో బాగా పుంజుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచిన బీజేపీ.. ఆ తర్వాత 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపొందింది. అంటే 8 అసెంబ్లీ స్థానాల నుంచి 64 స్థానాలకు ఆ పార్టీ పుంజుకుంది. ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా తన బలాన్ని మరింత విస్తరించుకుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఆగమనంతో తెలంగాణ రాజకీయంలో ఎటువంటి మార్పు వస్తుందనేది ఆసక్తి పుట్టిస్తోంది.