చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం నిమ్స్.. కేసీఆర్ దీక్ష విమరణ ఇక్కడే..
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన రోజు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తేదీ 2009 నవంబర్ 29.
By: Tupaki Desk | 29 Nov 2024 7:30 AM GMTస్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన రోజు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తేదీ 2009 నవంబర్ 29. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ నినాదంతో 11 రోజుల ఆమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్.. ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చారు. స్వరాష్ట్ర కలను సాధించారు. అందుకే.. నాటి సంకల్ప దీక్ష ఏనాటికైనా ఉద్యమ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఉద్యమ నాయకుడి ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు దారివేసింది. దేశానికి స్వాతంత్ర్యం కోసం గాంధీ నడిచిన మార్గంలోనే సత్యాగ్రహి దీక్షను చేపట్టి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. తెలంగాణ విద్రోహుల కుట్రలను కనిపెడుతూ ఉద్యమాన్ని నది ప్రవాహంలా మార్చడంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్.
శ్రీకాంతాచారి, యాదయ్య, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వందలాది మంది యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే.. చలించిపోయిన కేసీఆర్.. తన ప్రాణత్యాగానికి సిద్ధం అయ్యారు. అందుకే.. నవంబర్ 29న మొదలుపెట్టిన ప్రాణత్యాగ దీక్ష డిసెంబర్ 9 వరకు కొనసాగింది. చివరకు స్వరాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటన వచ్చే వరకూ ఆ దీక్ష నడిచింది.
నవంబర్ 29న కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళ్తుండగా.. అలుగునూర్ చౌరస్తా వద్ద కేసీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ వెంటనే ఆయనను ఖమ్మం తరలించారు. అరెస్ట్ చేసినప్పటికీ కేసీఆర్ జైలులోనే తన దీక్ష కొనసాగించారు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా కఠోర దీక్ష కొనసాగించారు. ఖమ్మం జైలులో దీక్ష చేస్తుండగానే ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో వెంటనే కేసీఆర్‌ను నిమ్స్‌కు తరలించారు. డిసెంబర్ 9న కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేసింది. దీంతో నిమ్స్ వేదికగా కేసీఆర్ తన దీక్షను విరమించారు. స్వరాష్ట్ర కల నెరవేరడంతో అప్పుడు ఆయన నిమ్మరసం పుచ్చుకొని దీక్షను వదిలిపెట్టారు. అందుకే.. నాటి దీక్షను కొనసాగిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్ దీక్షలు కొనసాగిస్తున్నాయి.