తెలంగాణలో వింత.. కేసీఆర్ కట్టించిన ఇళ్లలోకి రేవంత్ గృహ ప్రవేశం
2026 జూన్ లోగా మూసీ నదిలోకి వచ్చే నీటిని శుద్ధి చేసి మంచినీళ్లను ప్రవహింపజేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం.
By: Tupaki Desk | 29 Sep 2024 3:30 PM GMTతెలంగాణలో ప్రస్తుతం రెండే అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. ఒకటి హైడ్రా.. రెండో మూసీ ప్రక్షాళన.. మూడు నెలల కిందట ఏర్పడిన హైడ్రా చెరువుల పరిరక్షణలో రాజీ లేదంటూ దూసుకెళ్తోంది.. నీటి వనరులను ఆక్రమించిన వారిలో బడా బాబులు ఉన్నా వదిలి పెట్టడం లేదు. ఆదివారాలు వచ్చాయంటే హైడ్రా వారం అనే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియడం లేదు. మరోవైపు మూసీ ప్రక్షాళన. మురికి కూపంగా మారిన ఈ నదిని ప్రపంచ ప్రఖ్యాత స్థాయికి ప్రక్షాళన చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దీనికి అనుగుణంగా మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్ (నదీ గర్భం)లో నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారిని వేరేచోటకు తరలిస్తున్నారు.
రెండేళ్లలో మంచి నీరు ప్రవహించేలా
2026 జూన్ లోగా మూసీ నదిలోకి వచ్చే నీటిని శుద్ధి చేసి మంచినీళ్లను ప్రవహింపజేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం. వాస్తవానికి కొత్త ప్రాజెక్టు మూసీ సుందరీకరణకే కాదు.. ప్రక్షాళన చేసి ప్రజలను ప్రమాదం నుంచి కాపాడే గొప్ప ఉద్దేశంతో చేపట్టింది. మూసీలోకి వస్తున్న మురుగును రూ.3,800 కోట్లతో శుద్ధి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు వారంలో టెండర్లు పిలుస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే 55 కిలోమీటర్ల పొడవైన ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గించనున్నారు. నదీ తీరం వెంట పార్కింగ్ సదుపాయాలు, పార్కులను నిర్మాణం ఇలా ఒకటేమిటి..? అనేక హంగులు కల్పిస్తున్నారు. మొత్తానికి రూ.లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన కొనసాగనుంది. ఇంతటి భారీ ప్రాజెక్టును ఎత్తుకున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు.
పదివేల కుటుంబాల తరలింపు
మూసీ తీరంలోని 10 వేల ఇళ్లను గుర్తించి వారిని హైదరాబాద్ లోని 14 ప్రదేశాలకు మారుస్తున్నారు. వీరికి రూ.25-30 లక్షల విలువైన ఇళ్లను ఇస్తున్నారు. అంతేకాక మహిళలకు మెప్మా ద్వారా జీవనోపాధి కల్పించనున్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల సమన్వయంతో అర్హులకు పథకాలు అందేలా చూస్తారు. విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా గురుకులాల్లో చేర్పించనున్నారు. ఇలా మూసీ పరివాహకం నుంచి తరలించినవారి సందేహాలను తీర్చేందుకు 23 ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. నిర్వాసితుల్లో దాదాపు 90 శాతం మంది ఖాళీ చేసేందుకు అంగీకరించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి
కేసీఆర్ ప్రభుత్వం ఉండగా తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కేసీఆర్ సైతం పలు సమావేశాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లలోకి అల్లుడు వస్తే అత్తమామలు బయటపడుకునే పరిస్థితి ఉందని.. ఇలాంటిది నివారించేందుకు డబుల్ బెడ్ రూం ఇళ్లను చేపట్టామని చెప్పుకొచ్చారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వంలో ఈ పథకం అమలు పూర్తిస్థాయిలో జరగలేదనే విమర్శలు ఉన్నాయి. చాలాచోట్ల ఇళ్లు పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీ కాలేదు. ఇప్పుడు హైదరాబాద్ లో మూసీ నిర్వాసితులను డబుల్ బెడ్ రూంలలోకి తరలిస్తున్నారు. 84 కుటుంబాలకు ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేయడం గమనార్హం. మూసీ మురికి కూపం నుంచి వీరు కాస్త మంచి వాతావరణం ఉండే డబుల్ బెడ్ రూంలలోకి వెళ్లనున్నారమాట.
కొసమెరపు: మూసీ నిర్వాసితులు కొందరికి జూబ్లీ హిల్స్ లోని డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించారు. ఇక్కడి కమలానగర్ లో నిర్మించిన ఇళ్లలోకి వీరు వెళ్లనున్నారు. అంటే కేసీఆర్ కట్టించిన ఇళ్లలోకి రేవంత్ రెడ్డి గృహ ప్రవేశం అన్నమాట.