Begin typing your search above and press return to search.

కేసీఆర్.. తొంద‌ర ప‌డుతున్నారా? బీఆర్ఎస్ టాక్‌!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేస్తున్నానంటూ సంకేతాలు ఇచ్చారు. బుధ‌వారం పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం కూడా పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 10:30 AM GMT
కేసీఆర్.. తొంద‌ర ప‌డుతున్నారా? బీఆర్ఎస్ టాక్‌!
X

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేస్తున్నానంటూ సంకేతాలు ఇచ్చారు. బుధ‌వారం పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం కూడా పెట్టుకున్నారు. అయితే.. ఆయ‌న రాక మంచిదే అయినా.. ప్ర‌జ‌ల నాడి ఇంకా బీఆర్ ఎస్‌కు అనుకూలంగా మార‌లేద‌న్న‌ది ఆ పార్టీ నాయ‌కులే చెబుతున్నారు.. ఇటీవ‌ల మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ కూడా.. దాదాపు ఇదే మాట చెప్పుకొచ్చారు. మాకు ఇంకా స‌మ‌యం ఉంది! అని ఆయ‌న వ్యాఖ్యానించారు. జిల్లాల స్తాయిలో కూడా ఇదే వినిపిస్తోంది.

కాంగ్రెస్ స‌ర్కారు ఏమీ చేయ‌డం లేద‌ని, రైతు బంధును తాము ఎంతో మందికి ఇచ్చామ‌ని.. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని.. కేసీఆర్ చెబుతున్నారు. కానీ, వాస్త‌వానికి రైతుల‌కు చాలానే చేశామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. ఇది ఎలా ఉన్నా.. 50 వేల మంది ఉద్యోగాలు ఇవ్వ‌డం.. పోలీసు రిక్రూట్ మెంటు, ఉచిత బ‌స్సు, ఇందిర‌మ్మ ఇళ్లు, రేష‌న్ కార్డులు.. ఇలా .. రేవంత్‌రెడ్డి స‌ర్కారు దూకుడుగానే ప‌నిచేస్తోంది. దీనిపై సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

అయితే.. సాధార‌ణంగా ఏ ప్ర‌భుత్వానికైనా ఉండే చిన్న చిన్న లోపాలు .. రేవంత్‌రెడ్డి స‌ర్కారుకు కూడా ఎదుర‌వుతున్నాయి. ప్ర‌ధానంగా అవినీతి పెరుగుతున్న ద‌రిమిలా.. దీనిని క‌ట్టడి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మెజారిటీ ప్ర‌జ‌లు కోరుతున్నారు. చిన్న చిన్న ప‌నుల‌కు కూడా వేలల్లో లంచాలు తీసుకునే సంస్కృతి మ‌రింత పెరిగింది. రాష్ట్ర‌ స్థాయి స‌చివాల‌యంలోనే లంచాల‌కు మ‌రిగిన అధికారులు.. చేతులు త‌డ‌పందే ప‌నులు చేయ‌డం లేద‌న్నది నిష్ఠుర స‌త్యం.

ఇక‌, హైడ్రా దూకుడు మొద‌ట్లో బాగానే ఉన్నా..ఇప్పుడు హైద‌రాబాదీల‌ను హైడ్రానే క‌ల‌వ‌ర పెడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ఉదాసీన‌త‌.. ప్ర‌జ‌ల‌కు చేరువ కాక‌పోవ‌డం వంటివి క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించే కేసీఆర్‌.. తాను ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నాన‌ని చెబుతున్నారు. కానీ.. ఇప్ప‌టికిప్పుడు బీఆర్ ఎస్ ఆశించినంత వ్య‌తిరేక‌త కానీ.. కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న ప‌వ‌నాలు కానీ.. క‌నిపించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్ వ్యూహం వేరేగాఉంది.

త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో విజ‌యం ద‌క్కించుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని చెబుతున్నారు. స్థానికంగా సాధార‌ణంగా ప్ర‌భుత్వ పార్టీ వైపే ప్ర‌జ‌లు మొగ్గు చూపుతారు. దీనిని అడ్డుకుని బీఆర్ ఎస్ జెండా ఎగ‌రేయాల‌న్న‌ది కేసీఆర్ ల‌క్ష్యం. దీని కోస‌మే ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని బీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు.. పార్టీలో నేత‌ల‌ను క‌ట్ట‌డి చేస్తున్నా ఐక్యత క‌నిపించ‌క పోవ‌డం .. బీఆర్ ఎస్‌ను కుదిపేస్తున్న అంశం. ముందు ఇంటిని చ‌క్క బెట్టుకుంటే.. బాగుంటుంద‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.