Begin typing your search above and press return to search.

కారు.. సారు.. వినాయక చవితి తర్వాత జనంలోకి

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్క రోజే హాజరైన కేసీఆర్.. ఇక ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 12:30 PM GMT
కారు.. సారు.. వినాయక చవితి తర్వాత జనంలోకి
X

గత ఏడాది నుంచి తెలంగాణలో తీవ్ర సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇటీవల కలిగిన అత్యంత పెద్ద ఉపశమనం.. అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై విడుదల కావడం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి ఐదునెలలుపైగా తిహాడ్ జైలులో ఉన్నారు కవిత. ఆమె పిటిషన్ గతంలో పదేపదే నిరాకరణకు గురైంది. ఇప్పుడు బెయిల్ రావడంతో అధినేత కేసీఆర్ కు పెద్ద ఊరట దక్కింది. మరోవైపు డిసెంబరులో ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ వెంటనే ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ కు వెళ్లిపోయి కిందపడి గాయపడ్డారు. మార్చిలో కవిత అరెస్టయ్యారు. గాయం ఇబ్బంది పెడుతున్నా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ కు ఆ ఫలితాలు కూడా అత్యంత నిరాశనే మిగిల్చాయి. ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం హనీమూన్ సమయం (ఆరు నెలలు) కూడా ముగిసింది. అయితే, అంతకుముందే కేసీఆర్ రైతుల సమస్యల పట్ల స్పందించారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరామర్శించారు.

కేసీఆర్ కనిపించారు.. నెల తర్వాత

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్క రోజే హాజరైన కేసీఆర్.. ఇక ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని ప్రకటించారు. ఆ రోజు మీడియా పాయింట్ దగ్గర తర్వాత మళ్లీ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. ఇటీవల కవిత ఫాంహౌజ్ కు వెళ్లి కలిసిన సందర్భంగా మాత్రమే కేసీఆర్ ను ప్రజలు చూశారు. అంటే నెల రోజుల విరామం తర్వాత. కాగా, ఇకపై ప్రజలకు మరింతగా దగ్గరగా ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

చవితి తర్వాత

సెప్టెంబరు 10 నుంచి కేసీఆర్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 7న వినాయ‌క చ‌వితి ఉంది. అది పూర్తయ్యాక కేసీఆర్ ప్రజా క్షేత్రంలోకి వెళ్తరాని చెబుతున్నారు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండగడుతూ జిల్లాల పర్యటన చేస్తారని చెబుతున్నారు. ప్రజలతో కలిసి ఉద్య‌మిస్తారని పేర్కొంటున్నారు. మరోవైపు కేసీఆర్ అధికారంలో లేకప్పటికీ.. ప్ర‌జ‌ల నుంచి లేఖ‌లు, ఫోన్లు, సందేశాలు వస్తున్నాయని.. బీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇందులో రేవంత్ ప్రభుత్వం పైనే ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి.

హైడ్రాపై కేసీఆర్ అభిప్రాయం అదే..

ఎన్నిక‌ల హామీలను నెరవేర్చలేని రేవంత్ సర్కార్.. దాన్నుంచి దారి మ‌ళ్లించేందుకు, రాజ‌కీయ నాయకుల నోరు నొక్కేందుకు హైడ్రాను తీసుకొచ్చిందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నారు. రుణ మాఫీపై రైతులు, ఇత‌ర ప‌థ‌కాల అమ‌లుపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. వారి త‌ర‌ఫున పోరాటానికే కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్తున్నారని పేర్కొంటున్నారు. ఆయన ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ణాళిక‌లు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పేరు ‘కేసీఆర్ సమర శంఖం’

కేసీఆర్ సాగించే పర్యటనకు ‘సమరశంఖం’ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 6 గ్యారంటీల అమలు, అదుపుతప్పిన పాలనపై ఆయన శంఖం పూరిస్తారని చెబుతున్నారు.