కేసీఆర్ సభకు నమస్కారమేనా ?
తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి.
By: Tupaki Desk | 8 Dec 2024 4:42 PM GMTతెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. శీతాకాలం సమావేశాలుగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలలో కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు అనేక అంశాలు చర్చించాలని నిర్ణయించారు. అయితే ఈసారి సమావేశాలకు కేసీఅర్ వస్తారా రారా అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంది.
అసెంబ్లీకి కేసీఅర్ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా కోరుకుంటున్నారు. అంతే కాదు ప్రతిపక్ష సీటు ఖాళీగా ఉండడం మంచిది కాదు అని ఆయన అంటున్నారు. కేసీఆర్ తన అనుభవంతో కూడిన సలహా సూచనలను ఇవ్వాలని ఆయన అంటున్నారు.
అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు కానీ బీఆర్ ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఅర్ వచ్చే అవకాశాలు అయితే ఈసారి కూడా ఉండకపోవచ్చు అని అంటున్నారు. కేసీఅర్ సభ కంటే జనాల్లోకి వెళ్ళడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన కొత్త ఏడాది జనవరి తరువాత జనంలోకి వెళ్తారు అని అంటున్నారు
అందుకే ఆయన తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సభలో ఎలా వ్యవహారించాలి అన్న దాని మీద దిశా నిర్దేశం చేశారు. ఇక సోమవారం నుంచి మొదలవుతున్న తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలలకు సంబంధించి బీఆర్ ఎస్ అజెండా ఎలా ఉండబోతోంది అన్నది కేసీఆర్ గజ్వేల్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ లో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ఏడాది కాంగ్రెస్ పాలన మీద విమర్శలు సంధించారు అని అంటున్నారు. ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పాలన అన్ని విధాలుగానూ విఫలం అయింది అని ఆయన అంటున్నారు అందుకే ప్రతీ అంశాన్ని వదిలిపెట్టకుండా సభలో నిలదీయాలని తన పార్టీ ప్రజా ప్రతినిధులకు ఆయన సూచించారని తెలుస్తోంది.
అంతే కాదు విద్యారంగంలో ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రస్తావించాలని కోరారు. అలాగే, గురుకుల పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితులను సైతం ఎండగట్టాలని అన్నారు. ఇక హాట్ హాట్ చర్చలో ఉన్న మూసీ సుందరీకరణ, హైడ్రా అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ కోరారని అంటున్నారు.
దీంతో కేసీఆర్ ఈసారి కూడా సభకు నమస్కారం పెట్టేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ఇటీవలనే బడ్జెట్ సెషన్ ముగిసింది. దానికి విపక్ష నేత జగన్ హాజరు కాలేదు. తన పార్టీ వారిని కూడా పంపించలేదు. ఇక తెలంగాణాలో ఇపుడు అసెంబ్లీ అంటే అందరి ఫోకస్ కేసీఅర్ మీద పడుతోంది. కానీ ఆయన కూడా హాజరు అయ్యే చాన్సెస్ తక్కువ అంటున్నారు. మొత్తానికి విపక్ష నేతలు లేకుండానే రెండు చోట్లా అసెంబ్లీ సమావేశాలు జరుగడం ఒక అనావాయితీగా మారుతోందన్న మాట.