`మహా` ఎన్నికల్లో కేసీఆర్ ఉనికి.. ప్రశ్నార్థకం!
ఇలాంటి సమయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన కానీ, ఆయన పేరు కానీ.. ఎక్కడా వినిపించకపోవడం.. ఆయన తాలుకు ఫొటోలు కూడా కనిపించకపోవడం గమనార్హం.
By: Tupaki Desk | 10 Nov 2024 9:30 AM GMTతెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్రలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 20న అక్కడ పోలింగ్ జరగనుంది. అంటే.. మరో పది రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తి కానుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన కానీ, ఆయన పేరు కానీ.. ఎక్కడా వినిపించకపోవడం.. ఆయన తాలుకు ఫొటోలు కూడా కనిపించకపోవడం గమనార్హం. నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్రసమితిగా మార్చింది.. జాతీయస్థాయిలో పుంజుకునేందుకే.
ఈ విషయాన్ని అప్పట్లో కేసీఆర్ కూడా పదే పదే చెప్పారు. అంతేకాదు.. మహారాష్ట్రలోని తెలంగాణ సరిహద్దు జిల్లాలైన నాందేడ్, గడ్చిరోటి, చంద్రపూర్, యవత్మాల్ లలో బీఆర్ ఎస్ జెండాను కూడా ఎగుర వేశారు. అక్కడి చోటా నాయకులను కూడా పార్టీలోకి తీసుకున్నారు. చిన్న చితక పార్టీలకు మద్దతు కూడా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇక్కడ పోటీ చేస్తామని కూడా చెప్పారు. దాదాపు 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా ఇక్కడ ఉన్నాయి. అయితే.. ఇదంతా గతం.
ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. కేసీఆర్ ఎక్కడా కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టలేదు. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో ఒక్కటంటే ఒక్కస్థానంలోనూ కేసీఆర్ పార్టీ కానీ, ఆయన మద్దతిచ్చే నాయకులు కానీ కనిపించడం లేదు. అంటే.. మహా ఎన్నికల్లో పోటీ చేస్తామని.. ఇక్కడ బీజేపీని, కాంగ్రెస్‌ను బలంగా ఎదిరించి తాము ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పిన అన్ని మాటలు వృథా అయ్యాయి. పోనీ.. కేసీఆర్ కోసం వేచి చూసిన పార్టీలకు కూడా ఆయన ఎలాంటి మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. మొత్తానికి బీఆర్ ఎస్ తెలంగాణకే పరిమితం అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి.