ఖమ్మం అంత మునిగాక కూడా కేసీఆర్ వెళ్లరా?
ప్రజలకు కష్టం వచ్చిన వేళ.. వారికి ఓదార్పును ఇవ్వటానికి.. ధైర్యం చెప్పటానికి.. వారికి తాము అండగా ఉన్నామన్న విషయాన్ని చెప్పేందుకు అధినేతలు స్పందించాల్సి ఉంది
By: Tupaki Desk | 3 Sep 2024 12:25 PM GMTప్రజలకు కష్టం వచ్చిన వేళ.. వారికి ఓదార్పును ఇవ్వటానికి.. ధైర్యం చెప్పటానికి.. వారికి తాము అండగా ఉన్నామన్న విషయాన్ని చెప్పేందుకు అధినేతలు స్పందించాల్సి ఉంది. చేతిలో అధికారం ఉంటేనే కాదు.. లేకున్నా కూడా రియాక్టు కావొచ్చు. ఏపీలో విరుచుకుపడిన వరదలతో విజయవాడ ఆగమాగం కావటం తెలిసిందే. విజయవాడ జల విలయంపై రియాక్టు అయిన వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లటం.. వారిని పరామర్శించటం తెలిసిందే.
ఏపీలో విజయవాడ మాదిరే తెలంగాణలోనూ ఖమ్మం పట్టణం వరదపోటుకు దారుణంగా దెబ్బతింది. ప్రాణ నష్టం వాటిల్లింది. సాయం కోసం అక్కడి ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వేళలో.. బాధితులకు ధైర్యం చెప్పేందుకు.. వారి కష్టాల గురించి తెలుసుకొని.. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపేందుకు విపక్ష నేతగా ఉన్న కేసీఆర్ బయటకు రావాల్సి ఉంది. అదేం సిత్రమో కానీ.. విపక్ష నేతగా ఉన్న వేళలోనూ ఫాంహౌస్ కు పరిమితమైన కేసీఆర్ అక్కడి నుంచి బయటకు రావటం హాట్ టాపిక్ గా మారింది.
మొన్నటికి మొన్న బడ్జెట్ సమావేశాల సమయంలో తాను ప్రజల తరఫున పోరాటం చేస్తానని.. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగిన కేసీఆర్.. ఆ తర్వాత నుంచి మళ్లీ పత్తా లేరు. తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం పట్టణాన్ని సందర్శిస్తారని.. బాధితుల వెతల్ని వింటారని భావించారు. భారీ వరద కారణంగా గడిచిన మూడు రోజులుగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికి..కేసీఆర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
సాధారణంగా విపత్తులు విరుచుకుపడిన వేళలో.. అధినేతలు స్పందించటం.. వెంటనే బాధిత ప్రాంతాలను సందర్శించి.. బాధితులకు ధైర్యం చెప్పటం మామూలే. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రకటన చేయకపోవటం సంచలనంగా మారింది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షం స్పందించాల్సిన సమయంలోనూ కామ్ గా ఉండటం కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.