Begin typing your search above and press return to search.

లడ్డూ వివాదంపై కేసీఆర్ మౌనం ఎందుకు..?

తిరుమల శ్రీవారి లడ్డూ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలనే కాదు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో చర్చకు దారితీసింది

By:  Tupaki Desk   |   23 Sep 2024 10:30 AM GMT
లడ్డూ వివాదంపై కేసీఆర్ మౌనం ఎందుకు..?
X

తిరుమల శ్రీవారి లడ్డూ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలనే కాదు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల్లో చర్చకు దారితీసింది. హిందువులందరి నుంచి ఈ అంశంపై నిరసనలు వినిపించాయి. అటు పొలిటికల్ గానూ పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించాయి. పార్టీలకతీతంగా నేతలు ఈ ఉదంతంపై స్పందించారు. ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పార్టీలకతీతంగా నేతలు స్పందించారు.

అయితే.. ఈ లడ్డూ విషయంపై ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ నడుస్తుంటే.. అందరూ ఖండిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడా తన వాయిస్ వినిపించలేదు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కానీ.. ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులు కానీ ఎక్కడా మాట్లాడింది లేదు. ఆ పార్టీ తరఫున కూడా ఎవరూ ఈ అంశంపై నోరు మెదపలేదు. ఖండించింది లేదు.. టీటీడీ మీద మాట్లాడిందీ లేదు.

కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లోనూ ఇద్దరు కలుసుకున్నారు. రాష్ట్రాల సమస్యలపై చర్చించారు. పలు సమస్యలను కొలిక్కి తీసుకొచ్చారు. కేసీఆర్ ఏపీకి సైతం వెళ్లారు. జగన్ కూడా హైదరాబాద్ కేసీఆర్‌తో చాలా సార్లు భేటీ అయ్యారు. దాంతో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. పేరుకు రెండు పార్టీలు, రెండు రాష్ట్రాల సీఎంలు అయినా సోదరుల్లా కలిసిపోయేవాళ్లు. ఇప్పుడు ఒకే టర్మ్‌లో ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ అధికారాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం లడ్డూ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. దీనిపై అన్ని పార్టీలు స్పందించాయి. ఇప్పటికే బీజేపీ నేతలు విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఖండించారు. ప్రభుత్వం తరఫున విజయ డెయిరీ నుంచి నెయ్యి సప్లయ్ చేస్తామంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. ఇలా వన్ బై వన్ అందరూ స్పందిస్తుంటే.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. అయితే.. లడ్డూ వ్యవహారం అంతా కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే జరగడంతో.. ఆయనతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలోనే కేసీఆర్ స్పందించడం లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కాకున్నా.. ఆ పార్టీ తరఫున మరే ఇతర నేతలైనా స్పందించాస్తారేమోనని చూసినప్పటికీ ఎక్కడా ఎవరూ నోరు మెదపకపోవడంపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.