Begin typing your search above and press return to search.

జనంలోకి కేసీఆర్.. సుదీర్ఘ విశ్రాంతికి సెలవు!

కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు, బీసీ అంశాలపై రెండు భారీ సభలు నిర్వహించాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   10 Feb 2025 3:30 PM GMT
జనంలోకి కేసీఆర్.. సుదీర్ఘ విశ్రాంతికి సెలవు!
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇవ్వాలని భావించిన మాజీ సీఎం కేసీఆర్.. ఆ టైమ్ అయిపోయిందని భావిస్తున్నారట. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికావడం, స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుండటంతో జనం మధ్యకు రావాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రైతు, బీసీ అంశాలపై రెండు భారీ సభలు నిర్వహించాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతు, బీసీ సమస్యలపై రెండు భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రెండు కూడా కేసీఆర్ గతంలో పోటీ చేసిన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలతోపాటు రైతుల్లోనూ అసంతృప్తి ఎక్కువవుతున్నట్లు కేసీఆర్ భావిస్తున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, బీసీల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని అంటున్నారు. అదేవిధంగా రైతు బంధు పేరిట ప్రతి రైతుకు ఆర్థిక సాయం చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు పథకం ఓ ఏడాది ఎగ్గొట్టిందని, అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టిందని విమర్శలు ఎదురవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన కూడా వివాదాస్పదమవుతోందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ జనం మధ్యకు వస్తే స్థానిక ఎన్నికల్లో పార్టీకి లబ్ధి జరుగుతుందని భావిస్తోంది. దీంతో గజ్వేల్, కామారెడ్డిల్లో ఐదేసి లక్షల మందితో సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని కేసీఆర్ తన ఫాం హౌస్ కే పరిమితమయ్యారని కాంగ్రెస్ తరచూ విమర్శిస్తోంది. కేసీఆర్ బయటకు వచ్చి ప్రజా సమస్యలపై తమకు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కవ్విస్తోంది. అధికార పార్టీ ఎంతలా వేటాడుతున్న కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటూ వస్తున్నారు. అయితే తాను ప్రభుత్వ పనితీరును పరిశీలిస్తున్నానని, తగిన సమయంలో జనం మధ్యకు వచ్చి కాంగ్రెస్ ను నిలదీస్తానని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఆయన రీ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో రైతు, బీసీ భేరి నిర్వహణకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలియడంతో గులాబీ పార్టీలో జోష్ కనిపిస్తోంది.

గత పదమూడు నెలల్లో కేసీఆర్ రెండు సార్లు మాత్రమే ఫాంహౌస్ వీడి బయటకు వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతోపాటు అసెంబ్లీకి ఓ సారి వచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత పూర్తిగా ఎర్రవల్లిలోనే ఉంటున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరైనా ఆయనను కలిసేందుకు ఎర్రవల్లి వెళుతున్నారు. అక్కడ వారితో పిచ్చాపాటిగా మాట్లాడుతున్న కేసీఆర్ రాష్ట్ర పర్యటన విషయమై ఇన్నాళ్లు సస్పెన్ష్ కొనసాగించారు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని తనకు నివేదికలు అందుతున్నాయని చెబుతున్న కేసీఆర్.. సింహ గర్జనకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ కార్యక్రమాలకు వేదిక ఫిక్స్ అయినా డేట్ ఖరారు కాలేదు. త్వరలో ఆ ముహూర్తం కూడా నిర్ణయించి అధికారిక పర్యటన చేస్తారంటున్నారు. తమ అధినేతను తట్టుకునేందుకు కాంగ్రెస్ రెడీగా ఉండాలంటూ గులాబీ శ్రేణులు కవ్విస్తున్నారు.