కిందపడ్డా `పైచేయి`: కేసీఆర్ అంటే ఇట్టుంటది!
ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నంలో ఒక్కొక్కసారి తడబాటు తప్పదు. ఓటమి నుంచి అనేక పాఠాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది.
By: Tupaki Desk | 20 Feb 2025 3:59 AM GMTప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నంలో ఒక్కొక్కసారి తడబాటు తప్పదు. ఓటమి నుంచి అనేక పాఠాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టయిలే వేరు కదా! ఆయన కింద పడ్డా పైచేయి నాదే అనే టైపు! అచ్చం ఇప్పుడు అలానే కామెంట్లు చేశారు. సంక్షేమ పథకాల కోసమే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని.. లేకపోతే మనదే గెలుపు అని ఆయన ముక్తాయించారు. అంటే.. ఈ ఓటమిని(2023లో) ఓటమిగా ఆయన చూడ లేకపోతున్నారు. కేవలం సంక్షేమ పథకాల కోసమే ప్రజలు అటు వైపు మొగ్గారన్న వాదనలోనే ఉన్నారు.
ఇదే వాస్తవం అయితే.. కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే .. కేసీఆర్ కూడా తన పదేళ్ల హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు కదా! డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళిత బంధు, కళ్యాణలక్ష్మి, రైలు బంధు.. ఇలా.. అనేక సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రకటించారు కదా! మరి ఎందుకు గెలవలేకపోయారు? అనే ప్రశ్న. గెలుపు సాధించినప్పుడు.. తమ సత్తా అని చాటుకునే పార్టీలు, నాయకులు.. ఓటమి తర్వాత మాత్రం దానిని ప్రత్యర్థులపై తోసేయడం రివాజుగా మారింది. తాము ఓడిపోయామంటే.. దానికి ఉన్న కారణాలను విశ్లేషించుకుని.. తప్పులు సరిచేసుకునే సంప్రదాయం ఉంటుంది.
కానీ, నేడు రాజకీయ పార్టీలు.. తప్పులు గ్రహించకపోగా.. ప్రత్యర్థి పార్టీలపై చేస్తున్న కామెంట్లు వింతగా ఉంటున్నాయి. ప్రజలకు అందుబాటులో లేకపోవడం.. చెప్పిన హామీలను సరిగా నెరవేర్చకపోవడం.. కేంద్రంలోని బీజేపీలో పేపర్ కత్తుల పోరు.. అధికా రంలో ఉండి చేసిన నిరసనలు.. వంటివి కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజీ చేయగా.. ఫలితంగా ఎన్నికల్లో బీఆర్ ఎస్‌కు ప్రజలు తెరదిం చి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. పైగా.. సీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియకపోయినా.. కాంగ్రెస్‌కు ఓటెత్తారంటే.. దానిని ఎలా చూడాలి? బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు.. వంటివి దాచేస్తే దాగుతాయని కేసీఆర్ అనుకున్నా.. ప్రజలు కుండబద్దలు కొట్టినట్టు తమ తీర్పు ఇచ్చారు.
అయితే.. దీనిని పాక్షికంగా అయినా గుర్తించే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత సహా నాయకులు లేకపోవడం గమనార్హం. ఇంకా తాము బలంగా ఉన్నామని.. కేవలం సంక్షేమ కోసం ప్రజలు కక్కుర్తి పడ్డారని అన్నట్టే వ్యవహరిస్తున్నారు. తద్వారా ప్రజలు కోల్పోయేది ఏమీ ఉండకవచ్చు. కానీ.. బీఆర్ఎస్ అధినేతగా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా కేసీఆర్ విజ్ఞత ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికైనా గత తప్పులను సరిచేసుకునే దిశగా అడుగులు వేస్తామని, ప్రజల కష్టాలకు తాము కన్నీళ్లవుతామని కేసీఆర్ చెప్పి ఉంటే.. ఆ రేంజ్ వేరేగా ఉండేది. కానీ, సంక్షేమానికి కక్కుర్తి పడ్డారని వ్యాఖ్యానించడం ద్వారా.. కేసీఆర్ మరో మెట్టు ఎక్కారో దిగారో తేల్చుకోవాలి.