Begin typing your search above and press return to search.

కేసీఆర్.. రేవంత్ వేర్వేరు కాదు ఇద్దరు ఒక్కటే!

కేసీఆర్.. రేవంత్ ఇద్దరూ రాజకీయాల్లో అత్యంత కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారు. ఈ క్రమంలో ఏళ్లకు ఏళ్లు ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కొంటూ వచ్చారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 10:30 AM GMT
కేసీఆర్.. రేవంత్ వేర్వేరు కాదు ఇద్దరు ఒక్కటే!
X

చూసినంతనే ఉత్తర.. దక్షిణ ధ్రువాల మాదిరి కనిపిస్తారు. కానీ తరచి చూస్తే మాత్రం ఇద్దరు జిరాక్స్ కాపీల మాదిరి కనిపిస్తారు. వయసు తేడా.. ఇద్దరికి పరిచయమైన రాజకీయం కాస్త వేరుగా ఉండటంతో కొంత మేర తప్పించి.. మిగిలిన గుణాల విషయంలో కేసీఆర్.. రేవంత్ ఇద్దరు ఒకేలాంటి మైండ్ సెట్ అన్నట్లుగా ఉంటుంది. అదెలా అన్నది ఈ ఇద్దరు అధినేతల మధ్య ఉండే కొన్ని పోలికల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ఇద్దరికి రాజకీయ గురువు చంద్రబాబే కావటం. ఇక.. వీరిద్దరిలోనూ కనిపించే కొన్ని గుణాలు కామన్ గా కనిపిస్తుంటాయి. వాటిల్లో ముఖ్యమైనది.. తాము టార్గెట్ చేసినోళ్లు ఎంతటి గొప్పోళ్లు.. పవర్ ఫుల్ అయినా పట్టించుకోరు. నిజానికి ఈ తెగింపే.. ఈ ఇద్దరిని అధినేతలుగా.. ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చునేలా చేసిందని చెప్పాలి. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని చెప్పాలి. కేసీఆర్.. రేవంత్ ఇద్దరూ రాజకీయాల్లో అత్యంత కింది స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారు. ఈ క్రమంలో ఏళ్లకు ఏళ్లు ఎన్నో కష్టనష్టాల్ని ఎదుర్కొంటూ వచ్చారు.

అదే సమయంలో తమకు అవకాశం దొరకాలే కానీ ఎదుటి వ్యక్తి ఎంతటి అత్యున్నత స్థాయికి చెందినా సరే.. పూచిక పుల్ల మాదిరి తీసేయటం.. తమ నోటి నుంచి వచ్చే మాటల్ని పవర్ ఫుల్ ఆయుధాలుగా ప్రయోగించటం ఇద్దరిలోనూ కనిపిస్తుంది. అలాంటి ఇద్దరు తలపడితే ఎంతలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా అప్పుడప్పుడు ఈ ఇద్దరి నోటి నుంచి వచ్చే మాటలు విన్నప్పుడు అనిపిస్తుంది.

రాజకీయంగా చూసినప్పుడు కేసీఆర్ ను ఒక దశ వరకు ఎవరూ పట్టించుకున్నది లేదు. అలాంటి పరిస్థితే రేవంత్ లోనూ కనిపిస్తుంది. రేవంత్ ను తరచూ మాజీ మంత్రి కేటీఆర్ ఒక మాట అంటుంటారు. గుంపు మేస్త్రీ అని. నిజానికి అటు కేసీఆర్.. ఇటు రేవంత్ ఇద్దరిని రాజకీయ వర్గాలు గుంపు మేస్త్రీగానే చూశాయే కానీ.. వారిద్దరిని ఫ్యూచర్ ముఖ్యమంత్రులుగా అనుకున్నోళ్లు లేరనే చెప్పాలి. కాకుంటే.. ఈ ఇద్దరిలోనూ కనిపించే తరచూ కనిపించే తెగింపు.. లేక్క చేయనితనం.. ప్రత్యర్థుల బలాల కంటే కూడా బలహీనతల మీద ఎక్కువగా ఫోకస్ చేసి.. వారిని దెబ్బ తీసే ధోరణి కనిపిస్తుంటుంది.

తమకు అవకాశం లభించే వరకు వెయిట్ చేయటం.. అందుకోసం ఎంత శ్రమకైనా సిద్ధమన్నట్లుగా వారిద్దరి తీరు ఉంటుంది. ఎవరిని లెక్క చేయనితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. దీనికి తోడు ఇద్దరిలోనూ కామన్ గా కనిపించే గుణం.. తమ మాటలతో ఎవరినైనా సరే కన్వీన్స్ చేసేయగలరు. అంతే కాదు.. తమ హవా నడపవనప్పుడు తగ్గి ఉండటం ఎలానో కూడా ఈ ఇద్దరు అధినేతలకు తెలుసు.

అంతేకాదు.. తల ఎగరేసినట్లుగా కనిపిస్తూ ఉండే ఈ ఇద్దరు.. కొన్ని సందర్భాల్లో ఎంతలా తగ్గి ఉండాలో కూడా బాగా తెలుసు. తమ విధేయతను ప్రదర్శించే విషయంలోనూ ఒకేలాంటి తీరు కనిపిస్తూ ఉంటుంది. అధికారంలో లేనప్పుడు.. వచ్చిన తర్వాత ‘ట్రీట్ మెంట్’ ఒకే తరహాలో ఉండటం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇద్దరిలో ఉండే ఒకేతేడా ఏమంటే.. కేసీఆర్ ఎవరికి యాక్సిస్ లో ఉండనట్లుగా కనిపిస్తారు. కానీ.. సరిగా ప్లాన్ చేస్తే ఆయన్ను కలవటం తేలిక. అదే సమయంలో రేవంత్ ను కలవటం చాలా ఈజీ అనుకుంటారు. వాస్తవానికి అదేమాత్రం నిజం కాదు. అందరికి యాక్సిస్ లో ఉన్నట్లుగా కనిపిస్తూనే.. తాను అనుకున్న వారికి మాత్రమే యాక్సిక్ ఇవ్వటం రేవంత కు బాగా తెలుసు. మొత్తానికి ఇద్దరు ఇద్దరే. ఒకే తాను ముక్కలే.