కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిల్
ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగగా, పిటిషనర్ తరఫు న్యాయవాది కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో హాజరుకావాల్సిన బాధ్యత ఉందని కోర్టుకు విన్నవించారు.
By: Tupaki Desk | 4 March 2025 7:10 PM ISTభారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి , ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అసెంబ్లీకి హాజరుకావడం లేదని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. విజయ్‌పాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగగా, పిటిషనర్ తరఫు న్యాయవాది కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో హాజరుకావాల్సిన బాధ్యత ఉందని కోర్టుకు విన్నవించారు.
- పిటిషన్‌లో చేసిన ప్రధాన వాదనలు:
*ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తాల్సిన బాధ్యత ఉంది.
*గత కొంతకాలంగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు.
*చట్ట ప్రకారం, ఎప్పటికప్పుడు సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
- కోర్టు స్పందన ఇదీ
విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం, ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిధి ఏమిటని ప్రశ్నించింది. శాసనసభ వ్యవహారాల తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌కు అర్హత లేదని కోర్టులో వాదించారు. అయితే, కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, తమ వాదనలు వినిపించేందుకు గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం ప్రతి ఎమ్మెల్యే బాధ్యత అయినప్పటికీ, దీనిపై చట్టపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.