Begin typing your search above and press return to search.

విద్యుత్ స్కామ్.. కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Nov 2024 7:30 AM GMT
విద్యుత్ స్కామ్.. కేసీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
X

తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఇక అధికారం చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో పాలన సాగిస్తోంది. అటు పాలనలో బిజీ ఉంటూనే.. ఇటు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు కీలక అంశాలపై విచారణ సాగుతోంది. చాలా వరకు విచారణలు చివరి దశకు చేరుకోగా.. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై చేపట్టిన విచారణ మాత్రం పూర్తయింది.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలను నిర్ధారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్‌ను నియమించింది. హైకోర్టు మాజీ జడ్జి ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో ముందుగా ఈ కమిషన్‌ ఏర్పాటైంది. కొన్ని కారణాలతో విచారణ తుది దశకు చేరుకున్న తరువాత నరసింహారెడ్డిని మార్చారు. ఆ తరువాత సుప్రీంకోర్టు మాజీ జడ్జి లోకూర్‌ను కమిషన్ చైర్మన్‌గా నియమించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఒప్పందంలో చోటుచేసుకున్న తప్పిదాలు ఏంటి? 2000 మెగావాట్ల కోసం కారిడార్‌ను బుక్ చేసుకొని, ఆ మేరకు విద్యుత్ కొనుగోలు చేయకుండా జరిమానాల రూపంలో పవర్ గ్రిడ్‌కు ఎంత చెల్లించారు? యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంతో ఏ మేరకు భారం పడనుంది? భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంతో జరిగిన నష్టమెంత..? తదితర అంశాలపై విచారణ నిమిత్తం ప్రభుత్వం ఈ కమిషన్‌ను నియమించింది. విచారణ పూర్తిచేసిన లోకూర్ గత నెల 29న పూర్తిస్థాయి నివేదికను ఇంధన శాఖ కార్యదర్శికి అందించారు. అయితే.. ఈ నివేదికలో కీలక అంశాలను కమిషన్ పేర్కొంది.

ముఖ్యంగా తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగినట్లుగా కమిషన్ నిర్ధారించింది. ఈ మేరకు ఆరు ఏడు అంశాలలో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడిందని నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. కొనుగోలులో ఏ మేరకు అవకతవకలు జరిగాయి..? బాధ్యులు ఎవరు..? అనే అంశాలను సైతం పొందుపరిచినట్లుగా తెలిసింది. ప్రధానంగా ఇందులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మరికొందరి పేర్లను ప్రముఖంగా పేర్కొన్నట్లుగా సమాచారం.

ఎట్టకేలకు ప్రభుత్వానికి నివేదిక అందడంతో మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ అవకతవకల అంశంలో వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రానున్న కేబినెట్ సమావేశంలోనే చర్చించి.. ఆయా నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అనంతరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీసుకునే చర్యలపై సభలోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.