రాజకీయాలకు కేసీఆర్ విరామం..? గులాబీ పార్టీ లోగో కూడా మారిందిగా..!
రాష్ట్రంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి కొనసాగారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా అధికారాన్ని కోల్పోయారు. దాంతో అప్పటి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు.
By: Tupaki Desk | 20 Oct 2024 8:58 AM GMTకేసీఆర్ అంటే తెలంగాణ రాజకీయాల్లో ఓ ట్రెండ్. తెలంగాణ యాస, భాషకు ఆయన కేరాఫ్. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకున్న కీలక నేత. పార్టీని ఒంటి చేత్తో నడిపించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పార్టీని స్థాపించి.. పార్టీని ఓ స్థాయిలో నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీగా స్థాపించి.. బీఆర్ఎస్‌గా రూపాంతరం వరకూ పార్టీలో ఆయన ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆరే బీఆర్ఎస్‌కు అధినేతగా కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ నేతలు కూడా ముందు నుంచి కేసీఆర్‌నే అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ వస్తున్నారు. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా సంప్రదాయం కొనసాగుతోంది. అటు బీఆర్ఎస్ లోగోలోనూ కేసీఆర్ బొమ్మను ఏర్పరిచారు. అయితే.. తాజాగా ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపింది.
రాష్ట్రంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి కొనసాగారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా అధికారాన్ని కోల్పోయారు. దాంతో అప్పటి నుంచి కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. తన ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. ఫాంహౌజ్ నుంచే పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. అయితే.. అనారోగ్యం కారణాల వల్లనా.. లేక కారణాల వల్లనో కానీ ఆయన ఇంతవరకు ప్రభుత్వం తీరుపైనా ఎలా కామెంట్స్ చేయలేదు. ఎలాంటి ప్రకటనా చేయలేదు కనీసం ప్రజల్లోకి కూడా రావడంలేదు.
కట్ చేస్తే.. రాష్ట్రంలో మూసీ అంశంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను తిప్పకొట్టేందుకు కాంగ్రెస్ వారు.. కాంగ్రెస్ వారు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వారు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. లక్షన్నర కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు నుంచీ ఆరోపిస్తూ వస్తున్నారు. మరోవైపు.. ఇప్పటివరకు కేవలం 117 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని.. లక్షన్నర కోట్లు ఖర్చు చేసేందుకు ఇదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా అని రేవంత్ దీటుగా బదులిచ్చారు.
ఇదిలా ఉండగానే.. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం తరఫున పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. మూసీ మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన వారు ఒకింత ఆశ్చర్యానికి ఆందోళనకు గురయ్యారు.
మూసీ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న క్రమంలో స్క్రీన్ మీద కేవలం కేటీఆర్ ఫొటో మాత్రమే కనిపించింది. కేసీఆర్ ఫొటో ఎక్కడా కనిపించలేదు. కేటీఆర్, బీఆర్ఎస్ లోగో మాత్రమే దర్శనం ఇచ్చాయి. దీనిని గమనించిన కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. మరోవైపు.. బీఆర్ఎస్ భవన్ వద్ద ఉండే పార్టీ లోగోలోనూ కేటీఆర్ పిక్ దర్శనమిచ్చింది. ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ లోగోలో ఇండియా మ్యాప్‌తోపాటు కేసీఆర్ ఫొటో ఉండేది. కానీ.. ఎప్పుడూ లేని విధంగా ఈసారి భారతదేశం మ్యాప్‌తో పాటు కేటీఆర్ ఫొటో కనిపించింది. దీంతో అసలు కేసీఆర్‌కు ఏమైంది..? అన్న ప్రశ్న మొదలైంది. ముందు నుంచి బీఆర్ఎస్‌లో టైగర్‌లా జీవించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు..? పార్టీలోనూ ఈ మార్పులకు గల కారణాలేంటి..? అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. రాజకీయ చాణక్యుడు అయిన కేసీఆర్.. రాజకీయాలకు విరామం ప్రకటించారా అన్న ప్రచారమూ జరుగుతోంది. అందుకే.. కేటీఆర్ మరింత యాక్టివ్ అయ్యారా అన్న సందేహాలూ వినిపిస్తున్నాయి