తగ్గేదేలే.. ఇక కేసీఆర్ దూకుడు చూడ్డానికి రెడీ అవ్వాలట!!
కేసీఆర్.. ఆయనో ఉద్యమ నేత. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చడంలో కీ రోల్ ఆయనదే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
By: Tupaki Desk | 1 Sep 2024 7:11 AM GMTకేసీఆర్.. ఆయనో ఉద్యమ నేత. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చడంలో కీ రోల్ ఆయనదే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే.. కేసీఆర్ కూడా సందర్భం చిక్కినప్పుడల్లా పులి నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చానని తనకు తానుగా చెప్పుకుంటూ ఉంటారు. తానను తాను రాజకీయ చాణక్యుడిగానూ పోల్చుకుంటూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆయన స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి..? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది..?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేళ్ల పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా కొనసాగారు. దశాబ్దకాలం పాటు రాష్ట్రాన్ని పాలించారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తారనే నమ్మకంతో ప్రజలు ఆయనకు రెండుసార్లు పట్టం కట్టారు. ఆ పదేళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ హవానే నడిచింది. ఏ ఎన్నికలో చూసినా గులాబీ జెండా రెపరెపలాడింది. ఏ గ్రామంలో.. ఏ మూలన చూసినా బీఆర్ఎస్ జెండాలే దర్శనమిచ్చాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా రూపాంతరం చెందింది.
అయితే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. ఊహించని విధంగా అధికారం కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక అప్పటి నుంచి కేసీఆర్‌కు, ఆయన పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. కేసులు, అవినీతి అక్రమాలు అంటూ ‘పుండు మీద కారం చల్లినట్లుగా’ రోజుకో కేసు మెడకు చుట్టుకుంటోంది. అంతేకాదు తన ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కవిత సైతం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై, నిర్మించిన ప్రాజెక్టులపై ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి. దీంతో అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆయన సైలెంట్‌గానే ఉంటూ వస్తున్నారు. ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు.
ఇదిలా ఉంటే.. కూతురు కవిత ఇటీవల ఐదు నెలల జైలు శిక్ష అనంతరం ఇటీవల విడుదల అయ్యారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌పై కదనభేరి మోగించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. బీఆర్ఎస్ నేతల రెక్వెస్ట్‌తో ఆయన ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారనేది తెలుస్తోంది. ఈ నెల 10 తరువాత దీని మీద నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటలు. ఇన్నాళ్లు అంతగా యాక్టివ్‌గా లేని కేసీఆర్.. ఇప్పుడు యాక్టివ్ అవ్వబోతున్నారని చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయింది. ఈ నెలల కాలంలో ఆ ప్రభుత్వం అమలు చేసిన హామీలు, రైతుల సమస్యలను ప్రధానంగా ఆయుధంగా చేసుకొని పోరాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పదేళ్ల కాలంలో ప్రజలకు కష్టాలు లేకుండా చూసుకున్నామని, కాంగ్రెస్ వచ్చిన అనతి కాలంలో అన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆ పార్టీ నేతల అభిప్రాయం కూడా. ఇవన్నీ బాగానే ఉన్నా.. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లుగా మనం మునుపటి కేసీఆర్‌ను చూసే అవకాశం ఉన్నదా..? తనలోని నాటి ఉద్యమ నాయకుడిని మరోసారి వెలుగులోకి తీసుకొస్తారా..? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతారా..? సమస్యలపై నిలదీస్తారా..? ఏం జరుగుతుందో వేచి చూద్దాం.