బీఆర్ఎస్ కాదు ఇక టీఆర్ఎస్...ముహూర్తం అపుడే !
టీఆర్ఎస్ ఆన్నది ఉద్యమ పార్టీగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో మొదలైన ఆ ప్రస్థానం అప్రతిహతంగా 2014 దాకా సాగింది.
By: Tupaki Desk | 19 March 2025 7:00 AM ISTటీఆర్ఎస్ ఆన్నది ఉద్యమ పార్టీగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించింది. తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో మొదలైన ఆ ప్రస్థానం అప్రతిహతంగా 2014 దాకా సాగింది. అంటే ఏకంగా 13 ఏళ్ళు పై మాట అన్న మాట. ఈ మధ్యలో ఎన్నో విజయాలు టీఆర్ఎస్ కి దక్కాయి. పార్టీ పెట్టిన ముహూర్త బలమో లేక పేరు బలమో తెలియదు కానీ టీఆర్ఎస్ అంటేనే తెలంగాణా అన్నట్లుగా బిగ్ సౌండ్ చేసింది.
2014లో అలాగే 2018లో కూడా రెండు సార్లు తెలంగాణాలో అధికారం దక్కించుకుంది. అయితే 2018లో రెండోసారి అధికారం దక్కాక కేసీఆర్ ఆలోచనలు జాతీయ రాజకీయాల మీదకు మళ్ళాయి. దాంతో ఆయన టీఆర్ఎస్ ని కాస్తా బీఆర్ఎస్ గా మార్చారు. అంటే భారత రాష్ట్ర సమితి అన్న మాట.
టీఅర్ ఎస్ ని 2022 డిసెంబర్ 9న బీఆర్ఎస్ గా మాచారు. అది లగాయితూ ఆ పార్టీకి కష్టాలే వెంటాడాయి. ఆ పార్టీ అన్ని విధాలుగా ఇబ్బందుల పాలు అయింది. నిజానికి బీఆర్ఎస్ ని పెట్టడానికి కారణం ఒడిశా ఏపీ మహారాష్ట్ర కర్ణాటక వంటి చోట్ల పోటీ చేసి గణనీయమైన ఎంపీ సీట్లు గెలిచి 2024 ఎన్నికల తరువాత కేంద్ర రాజకీయాల్లో కీలకం కావాలన్నది. అలా కేసీఆర్ తలిస్తే జనాలు వేరొక విధంగా తలచారు.
బీఆర్ ఎస్ అంటే మాకేంటి సంబంధం అనుకున్నారు. తెలంగాణాతో పేగు బంధం పోయింది అని వారు అనుకున్నారు. అందుకే బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది జనంలోకి వచ్చాక ఆ పార్టీని తీసి పక్కన పెట్టారు 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణా శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఇక 2024 మేలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా బీఅర్ఎస్ కి ఉన్న ఎనిమిది ఎంపీ సీట్లను కూడా పక్కన పెట్టి జీరో నంబర్ ఇచ్చేశారు.
ఒల గత పదిహేను నెలలుగా ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ చేయాల్సింది చేస్తున్నా రావాల్సిన మైలేజ్ అయితే రావడం లేదు. కాంగ్రెస్ పటిష్టంగా మారుతోంది. బీజేపీ కూడా ధీటుగా నిలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ మనుగడ మీద సొంత పార్టీలోనే కలవరం రేగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వద్దు టీఆర్ఎస్ ముద్దు అన్నది ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నుంచే మొదలైంది.
నేతలు అంతా అదే కోరుకున్నారు. ఇపుడు బీఆర్ ఎస్ అధినేత కేసీఅర్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అందుకోసం ఒక ముహూర్తం పెట్టారని అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పాతికేళ్ళ ఉత్సవాలు జరుగుతున్నాయి. పార్టీ పుట్టి పాతికేళ్ళు అయిన వేళ రజతోత్సవాలను ఘనంగా చేయాలని అనుకుంటున్నారు.
అందుకు పోరుగడ్డ ఓరుగల్లుని ఎంచుకున్నారు. అక్కడ వేదికగా బీఆర్ఎస్ ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకోబోతోంది. వాటిలో అత్యంత ప్రధానమైనదిగా బీఆర్ఎస్ పేరుని టీఆ రెస్ గా మార్చే సంచలన నిర్ణయం ఉండబోతోంది అని ప్రచారం సాగుతోంది. తెలంగాణ సెంటిమెంట్ ని తిరిగి పార్టీ పేరులోకి తెస్తూ టీఆర్ఎస్ గా మునుపటి ఉత్సాహం ప్రాభవం వైభవం అన్నీ తిరిగి తెచ్చుకోవడానికే ఈ నిర్ణయం అని అంటున్నారు.