పద్నాలుగేళ్ల తర్వాత ఇలా జరగటం ఏంటి బాసూ?
కట్ చేస్తే.. తాజాగా ఇదే రోజున కేసీఆర్ యశోద ఆసుపత్రి బెడ్ మీద ఉండటం.. తుంటి మార్పిడి సర్జరీతో ఆయన కోలుకుంటున్న వైనం తెలిసిందే.
By: Tupaki Desk | 10 Dec 2023 3:30 PM GMTసరిగ్గా పద్నాలుగేళ్లు. డిసెంబరు 9, 2009ను గుర్తుకు తెచ్చుకొని.. వర్తమానాన్ని తలుచుకుంటే.. ఒక్కసారి ఉలిక్కిపడటమే కాదు.. బోలెడన్ని ఆలోచనలు ముసురుతాయి. ఆ వెంటనే నోటి నుంచి వచ్చే మాట.. కాలం చెబుతున్నదేంటి? ఇప్పుడే ఇలా ఎందుకు జరగాలి? ఈ పరిణామాలు ఎలాంటి సందేశాల్ని ఇస్తున్నాయి? కేసీఆర్ అండ్ కో ఇప్పుడేం చేస్తే బాగుంటుంది? అసలు జరుగుతున్న పరిణామాల్ని గులాబీ దళం పట్టించుకుంటుందా? లాంటి సందేహాలు బోలెడన్ని కలుగుతున్నాయి.
పద్నాలుగేళ్ల క్రితం ఇదే డిసెంబరు 9న నిమ్స్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్.. తాను పుట్టించిన భావోద్వేగ వేడికి యావత్ తెలంగాణ రగిలిపోవటమే కాదు.. అల్లంత దూరాన ఉన్న ఢిల్లీ సర్కారుకు సైతం దడ పుట్టేలా చేసింది. 2009 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంలోని మన్మోహన్ సర్కారు ఓకే చెప్పటం.. ఈ మాటకు బదులుగా.. తన పోరుతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేయటం తెలిసిందే. పద్నాలుగేళ్ల క్రితం డిసెంబరు 9న నిమ్స్ ఆసుపత్రి బెడ్ మీద ఉండటం తెలిసిందే.
కట్ చేస్తే.. తాజాగా ఇదే రోజున కేసీఆర్ యశోద ఆసుపత్రి బెడ్ మీద ఉండటం.. తుంటి మార్పిడి సర్జరీతో ఆయన కోలుకుంటున్న వైనం తెలిసిందే. అప్పుడు ఆసుపత్రిలోనే.. ఇప్పుడు ఆసుపత్రిలోనే. అప్పుడు తెలంగాణ సాధన పోరాటంలో అనూహ్య విజయం సాధిస్తే.. ఇప్పుడు అందుకు భిన్నంగా కొద్ది రోజుల క్రితం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఓటమిని సొంతం చేసుకోవటం..కాంగ్రెస్ విజయం సాధించటం లాంటి పరిణామాలుచోటు చేసుకున్నాయి. మొత్తంగా.. పద్నాలుగేళ్ల విరామంలో చోటు చేసుకుంటున్న పరిణామాలన్ని కూడా తేడాగా జరగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల్ని చూస్తున్న వారిలో కొందరు.. 'కాలం చెబుతున్నదేంటి? అప్పుడు ఇప్పుడు సేమ్ సీన్ ఏంటి?' అనుకోవటమే కాదు.. కాసింత జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.