Begin typing your search above and press return to search.

2 దశాబ్దాల తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్

ఇదంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించేనని మీకు తెలిసిపోయి ఉంటుంది.. మరిప్పుడు ఈయన విషయంలోనే ఓ ఆసక్తికర పరిణామం కనిపించనుంది.

By:  Tupaki Desk   |   10 Dec 2023 8:29 AM GMT
2 దశాబ్దాల తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో కేసీఆర్
X

తెలంగాణలో ప్రస్తుత అసెంబ్లీ సెషన్ లో అవకాశం లేనప్పటికీ.. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సెషన్ లో మాత్రం ఓ ఆసక్తికర సీన్ కనిపించనుంది. 40 ఏళ్ల రాజకీయ జీవితం.. ప్రాథమిక సహకార సంఘం నుంచి కేంద్ మంత్రి వరకు పదవులు.. ఉమ్మడి రాష్ట్రలో కీలక మంత్రి పదవులు.. సొంతంగా పార్టీ స్థాపన.. తీవ్ర స్థాయి ఉద్యమంతో తెలంగాణ రాష్ట్ర సాధన.. ఆపై ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లు.. ఇదంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించేనని మీకు తెలిసిపోయి ఉంటుంది.. మరిప్పుడు ఈయన విషయంలోనే ఓ ఆసక్తికర పరిణామం కనిపించనుంది.

2004 తర్వాత ఇప్పుడే..

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సొంత నియోజకవర్గం సిద్దిపేట. 1983లో అక్కడ పరాజయం పాలైనప్పటికీ.. 1985 నుంచి 1999 వరకు టీడీపీ తరఫున అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి, తెలంగాణ సాధనే ధ్యేయంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేసి గెలిచారు. 2004 ఎన్నికల్లో తొలిసారి రెండుచోట్ల బరిలో దిగి సిద్దిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. ఆపై కేంద్ర మంత్రిగా కొనసాగే ఉద్దేశంతో సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2009 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. కాగా, పదేళ్ల తర్వాత 2014లో తెలంగాణ ఖాయమయ్యాక సిద్దిపేట కాకుండా గజ్వేల్ ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేశారు. తెలంగాణ సీఎంగా కొనసాగే ఆలోచనతో మెదక్ ఎంపీ పదవిని వదులుకున్నారు. కాగా, 2018లోనూ కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగానే నిలిచి గెలిచారు.

తొలిసారి 2 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసి

రాజకీయ జీవితంలో కేసీఆర్ తాజా ఎన్నికల్లో మాత్రమే రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో బరిలో నిలిచిన ఆయన కామారెడ్డిలో ఓడిపోయారు. కాగా, బీఆర్ఎస్ కూడా ఇటీవలి ఎన్నికల్లో పరాజయం పాలవడంతో కేసీఆర్ ప్రతిపక్షంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనను బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలు శనివారం ఎన్నుకున్నారు. 39 మంది ఎమ్మెల్యేల బలంతో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కానున్నారు.

అప్పట్లో ప్రతిపక్షంలో..

2000-01 మధ్యన టీడీపీకి రాజీనామా చేసిన కేసీఆర్.. సిద్దిపేట నుంచి గెలిచాక దాదాపు రెండున్నరేళ్లు ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో ఆయన ఒక్కరే బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని గెలిచినా, ఆయన ఎంపీగానే కొనసాగారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాతనే కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటినుంచి మొన్నటి ఆదివారం వరకు కేసీఆర్ అధికార పక్షంలోనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం ప్రతిపక్షంలో కూర్చోనున్నారు. అయితే, తుంటి ఎముక విరిగిన నేపథ్యంలో ఆయన ఆస్ప్రత్రి పాలయ్యారు. మరో 8 వారాల వరకు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీన్నిబట్టి ఫిబ్రవరి రెండో వారం వరకు కేసీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చే చాన్సుంది. అంటే.. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే (ఈ సారి ప్రతిపక్ష నేత కూడా)గా కేసీఆర్ అసెంబ్లీలో కనిపించనున్నారు.