కేసీ‘‘ఆరు’’.. తారుమారు.. రేవంత్ పంచన చేరు!
అంకెల్లో దేని ప్రత్యేకత దానిదే.. రాజకీయాల్లో అందుకే ఒకటి ప్లస్ ఒకటి.. ఎప్పుడూ పదకొండు కాదు అని చెబుతుంటారు.
By: Tupaki Desk | 6 Dec 2023 3:35 AM GMTఅంకెల్లో దేని ప్రత్యేకత దానిదే.. రాజకీయాల్లో అందుకే ఒకటి ప్లస్ ఒకటి.. ఎప్పుడూ పదకొండు కాదు అని చెబుతుంటారు. ఇక అంకెల్లో 6 నంబరుకు ఉన్న ప్రత్యేకత వేరే. దీనిని తిరగేస్తే 9 అవుతుంది. అంటే.. అత్యధికులు లక్కీ నంబరుగా భావించే సంఖ్య వస్తుంది. వాస్తవానికి ఇదంతా నమ్మకాల ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా ఇదే నంబరు లక్కీ అని ఎవరికి ఎవరూ చెప్పలేరు. అయితే, కొంతమంది మాత్రం తమకు నచ్చిన, అచ్చొచ్చిన నంబరును లక్కీగా భావిస్తారు. మొన్నటి వరకు తెలంగాణ సీఎంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ‘‘6’’ లక్కీ నంబరు అనే సంగతి తెలిసిందే. ఆయన కాన్వాయ్ వాహనాలు సహా తెలంగాలోని జిల్లాల సంఖ్య కూడా ‘‘6’’ వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. కానీ, అదే 6 ఇప్పుడు తిరగబడింది. ‘‘9’’ అయింది. ఈ నంబరు తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి లక్కీ నంబరు కావడమే ఇక్కడ విశేషం. అదెలాగంటే..
నవంబరు 6న కొడంగల్‌లో నామినేషన్
రేవంత్ అదృష్ట సంఖ్య 9 అనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. కేసీఆర్ వాహనాలన్నింటిపైనా 6 ఉంటే.. రేవంత్ వాహనాలపై 9 ప్రధానంగా ఉంటుంది. కానీ.. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఈసారి ఆయనకు కలిసిరాలేదు. రేవంత్ కు మాత్రం బాగా కలిసొచ్చింది. వాస్తవానికి ఏ పని తలపెట్టినా, ఏ కార్యక్రమాన్నైనా 6 కలసివచ్చేలా చేసేవారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాన్ని పక్కనపెట్టి ముహూర్త బలం, తిథులు, నక్షత్రాలు, శుభ ఘడియలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అయిగే, 9ని తన అదృష్ట సంఖ్యగా భావించే రేవంత్ కూడా.. ఈసారి తారాబలం ప్రకారమే ముందుకెళ్లారు. ఆయన యాదృచ్ఛికంగా.. కేసీఆర్ లక్కీ నంబర్ 6వ తేదీన (నవంబరు) నామినేషన్ వేశారు. తారాబలం ప్రకారం ఆ రోజు ఆయనకు ‘క్షేమతార’. అటు కేసీఆర్ ఏమో.. తారాబలం ప్రకారం 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ వేశారు.
సెంటిమెంటు లేదు..
కేసీఆర్ సెంటిమెంట్ ను ఫాలో కాకుండా ఓటమి పాలయ్యారని ఇప్పుడు అందరూ అంటున్నారు. రేవంత్ మాత్రం కేసీఆర్ లక్కీ నంబరు 6న నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్ ఏమో.. రేవంత్ లక్కీ నంబరు 9న నామినేషన్ వేశారు. ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. దీంతో ఇద్దరూ సెంటిమెంటును ఫాలో కాలేదని చెబుతున్నారు. కాగా, సీఎంగా ఉన్నప్పుడ కేసీఆర్ కాన్వాయ్ లో కూడా 6 అంకె వచ్చేలా చూసుకున్నారు. రేవంత్ సీఎం అవుతుండడంతో కాన్వాయ్ లో 9 నంబరు ఉండేలా మార్పులు చేశారు. వాస్తవానికి కేసీఆర్ లక్కీ నంబరు అయిన 6నే రేవంత్ సీఎం గా ప్రమాణం చేస్తారని మొదట కథనాలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ హై కమాండ్ ఆలస్యం చేయడంతో ఆగిపోయింది. ఒకవేళ 6 నే రేవంత్ ప్రమాణం చేసి ఉంటే అది కేసీఆర్ ను పరోక్షంగా వెక్కిరించినట్లు ఉండేది. చివరకు గురువారం.. అంటే ఈ నెల 7న రేవంత్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.