Begin typing your search above and press return to search.

బిగ్ న్యూస్... భూకబ్జా కేసులో కేసీఆర్ అన్న కొడుకు అరెస్ట్!?

ప్రస్తుతం కల్వకుంట్ల ఫ్యామిలీకి టైం ఏమాత్రం బాగున్నట్లు లేదనే చర్చ గత కొన్ని రోజులుగా తెలంగాణలో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 April 2024 10:56 AM GMT
బిగ్  న్యూస్... భూకబ్జా కేసులో కేసీఆర్  అన్న కొడుకు అరెస్ట్!?
X

ప్రస్తుతం కల్వకుంట్ల ఫ్యామిలీకి టైం ఏమాత్రం బాగున్నట్లు లేదనే చర్చ గత కొన్ని రోజులుగా తెలంగాణలో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం.. మరోపక్క లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కీలక నేతలంతా పార్టీని వదిలి బయటకు వెళ్లిపోవడం.. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవ్వడం.. ఇలా దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉందని అంటున్నారు.

దీనికి తోడు గతకొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైనా తీవ్ర చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన ఇద్దరితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారంటూ వెలుగులోకి వస్తున్న విషయాలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ సమయంలో... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు భూకబ్జా కేసులో అరెస్టవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ఒక భూవివాదం కేసులో కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు! మన్నెగూడ భూవివాదం కేసులో కన్నారావు ఏ1 గా ఉన్నాడనే విషయాన్ని చెబుతూ.. పోలీసులు మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది! భూ వివాదం విషయంలో తలదూర్చి, పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావు, మరో 35 మందిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఇటీవల కేసు నమోదైంది!!

ఇందులో భాగంగా.. మన్నెగూడ లో సుమారు 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారనేది అతడిపై ఉన్న ఆరోపణ అని చెబుతున్నారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారాని అంటున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారని చెబుతున్నారు!

ఇదిలా ఉంటే.. కన్నారావుపై 147, 148, 307, 427, 436, 447, 506, రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. మరికాసేపట్లో కన్నారావును పోలీసులు రిమాండ్‌ చేయనున్నారని సమాచారం!!