Begin typing your search above and press return to search.

కేసీఆర్ అభయానికి భిన్నంగా అంకెలు చెబుతున్న నిజాల మాటేంటి?

‘‘మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పని అయిపోయింది. ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి చావు దెబ్బ తగలనుంది

By:  Tupaki Desk   |   30 Jun 2024 5:30 PM GMT
కేసీఆర్ అభయానికి భిన్నంగా అంకెలు చెబుతున్న నిజాల మాటేంటి?
X

‘‘మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పని అయిపోయింది. ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి చావు దెబ్బ తగలనుంది. ప్రజలు తాము చేసిన తప్పుల్ని గుర్తించారు. ఈసారి ఎన్నికల్లో వారు తమ తప్పును దిద్దుకుంటారు. అద్భుతమైన మెజార్టీతో విజయాన్ని అందిస్తారు. అత్యధిక ఎంపీ సీట్లను బీఆర్ఎస్ కు కట్టబెడతారు’’ అచ్చంగా ఇవే మాటలు అని చెప్పం కానీ.. ఇంచుమించు ఈ తరహా టోన్ తో గులాబీ అధినేత.. గులాబీ చిన్నబాస్ కేటీఆర్ తో సహా హరీశ్ తదితరులు నమ్మకంగా చెప్పిన మాటల్ని తెలంగాణ ప్రజలు పట్టించుకున్నది లేదు.

అంతేనా.. ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినట్లుగా..ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కదని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మాటలు అతిశయంగా అనిపించినప్పటికీ.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కానీ గులాబీ హార్డ్ కోర్ అనుచరులకు.. క్యాడర్ కు విషయం బోధ పడింది. పెద్దసారు మాటల మీద నమ్మకంతో.. ఆయన మాటల్ని తూచా తప్పకుండా నమ్మి.. గెలుపు ధీమాను ప్రదర్శించిన చాలామంది ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ముఖం చూపించలేని పరిస్థితి.

ఇంత జరిగిన తర్వాత కూడా కేసీఆర్ లో మార్పు లేదంటున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ దారుణంగా దెబ్బ తింది. దీనికి కారణం.. పదేళ్లు తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన ఆ పార్టీ.. మొన్న ఫలితాలు వెల్లడైన ఎంపీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్న వాదనలకు బలం చేకూరింది.

అయినప్పటికీ రానున్న ఆర్నెల్లలో అద్భుతం జరగనుందన్న మాటల్ని అదే పనిగా చెబుతున్న కేసీఆర్ మాటలు ఆసక్తికరంగా మారాయి. గతంలో తనను కలిసేందుకు వచ్చే మంత్రులకు సైతం టైం ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు ఫాం హౌస్ కు ఎమ్మెల్యేల్ని కబురు చేసి మరీ పిలిపించుకోవటమే కాదు.. రానున్న రోజుల్లో పరిస్థితులు చక్కబడతాయని.. పూర్వ వైభవం ఖాయమన్న మాటల్ని చెప్పటం ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు.. ఆర్నెల్లు అగితే అనూహ్య పరిణామాలు ఏర్పడతాయని చెబుతున్నారు.

అక్కడితో ఆగని ఆయన.. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనేతల మధ్య ఉన్న లుకలుకల గురించి చెప్పటమే కాదు.. దానికి బలం చేకూరేలా కొన్ని ఆడియో క్లిప్పులను వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో కొందరు కాంగ్రెస్ మంత్రులు.. ముఖ్యనేతలు సీఎం రేవంత్ పై మండిపడటం కనిపిస్తోంది. అయితే.. ఈ ఆడియో క్లిప్పులు ఎప్పటివన్న దానిపై స్పష్టత రావట్లేదు. కేసీఆర్ మాటల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే నమ్మినట్లే ఆయన ముందు నమ్మకంగా వ్యవహరిస్తున్నా.. ప్రైవేటు సంభాషణల్లో మాత్రం భవిష్యత్తు ఏ మాత్రం ఆశాజనకంగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఓవైపు కేసీఆర్ పిలిచినప్పుడు ఫాంహౌస్ కు వెళ్లి.. ఆయన చెప్పిన మాటల్ని శ్రద్ధగా వింటున్న ఎమ్మెల్యేలు తమ విధేయతను నమ్మకంగా గులాబీ బాస్ ఎదుట ప్రదర్శిస్తూ సెలవు తీసుకుంటున్నారు. అనంతరం తమకు తోచినట్లుగా వారి తీరు ఉంటోంది. దీనికి ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఉదాహరణగా చెప్పాలి. రీసెంట్ గా ఫాంహౌస్ కు వెళ్లిన ఆయన గులాబీ బాస్ చెప్పిన మాటలన్నింటికి తల ఊపి.. అన్ని అంశాలు తనకు సమ్మతమేనని చెబుతూ.. రెండు రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేతలు మీదుగా భుజాన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఈ లెక్కన చూస్తే.. కేసీఆర్ మాటల్ని గులాబీ ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోవట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ.. గులాబీ బాస్ మాటలు ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ అవేమీ లెక్కలకు.. లాజిక్ కు మ్యాచ్ కావట్లేదని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు.. బీఆర్ఎస్ కు ఉన్న 30 ఎమ్మెల్యేలు (జంప్ అయిన వారిని మినహాయిస్తే) కలిపినా 38 మంది సభ్యుల బలమే ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 22 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది.

కాంగ్రెస్ లో అంత మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చే నాయకుడు ఎవరు? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే.. అప్పటికే బీఆర్ఎస్ నుంచి మరికొందరు ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ ఆకర్షిస్తే.. బీఆర్ఎస్ లోకి తీసుకురావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరుగుతోంది. ఓవైపు అధికారం చేతిలో ఉన్న రేవంత్.. కేసీఆర్ చేసే చేష్టల్ని చూస్తూ ఊరుకోరు కదా? ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా తెర మీదకు వచ్చే ప్రశ్నలు.. దానికి లభించే సమాధానాలు చూసినప్పుడు కేసీఆర్ మాటల్లోని డొల్లతనం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. అలాంటప్పుడు ఆర్నెల్లలో అదేదో అద్భుతం జరుగుతుందని చెప్పే గులాబీ బాస్ మాటల్లో గ్యాస్ తప్పించి మరేమీ లేదన్న వాదన వినిపిస్తోంది. తాను మాట్లాడే మాటలకు సరిపడే లాజిక్.. అంకెల బలాన్ని కేసీఆర్ చూపించే వీలుగా కసరత్తు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పటివరకు మౌనంగా ఉంటే మంచిది. లేదంటే ఉన్న మర్యాద కూడా మిస్ కావటం ఖాయం.