ఎంపీ సీట్లు ఎన్నైనా రావొచ్చు.. ఎగ్జిట్ పోల్స్ పై కేసీఆర్.. అసెంబ్లీకైతే 105
ఇక లోక్ సభ ఎన్నికల్లో అయితే తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం చెప్పలేదు
By: Tupaki Desk | 2 Jun 2024 9:38 AM GMTసీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును గెలుపు నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ హుషార్ అయ్యారు. గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో అధికారానికి దూరమైన ఆయన.. పాలమూరు ఎమ్మెల్సీ గెలుపుతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 105 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు.
ఇక లోక్ సభ ఎన్నికల్లో అయితే తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం చెప్పలేదు. బీఆర్ఎస్ పెద్ద చెట్లు అని.. మహా సముద్రం అని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఎవరికైనా నైరాశ్యం వస్తుందని.. తాము మాత్రం బస్సు యాత్ర చేపడితే ప్రజల్లో మంచి స్పందన కనిపించిందని పేర్కొన్నారు. ఇటీవల ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 105 సీట్లు ఖాయమని వ్యాఖ్యానించారని చెప్పారు. మనం డంబాచారాలు చెప్పలేదని.. పబ్లిక్ రిలేషన్ స్టంట్లు చేయలేదని.. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనని పేర్కొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ పై తనదైన శైలిలో..
శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్టిట్ పోల్స్ పై కేసీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ కు ఎన్ని సీట్లయినా రావొచ్చన్నారు. సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ సీటు గెలిచామని, ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుదల ఎమ్మెల్సీగా రాకేశ్ రెడ్డి విజయం సాధించనున్నారని జోస్యం చెప్పారు. లోక్ సభ సీట్ల ఎన్ని వస్తాయో చూద్దామని.. ఎగ్జిట్ పోల్స్ లో ఒకడు బీఆర్ఎస్ కు 11 వస్తాయని చెప్పారని, ఇంకొకడు 1 సీటే వస్తదని అన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరొకడు 2 నుంచి 4 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పాడన్నారు. ఎగ్జిట్ పోల్స్ పెద్ద జూదంగా మారాయని.. ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 11 సీట్లు నెగ్గితే పొంగిపోయేది లేదని, 2 వచ్చినా కుంగిపోయేది లేదని స్పష్టం చేశారు.