ఎరువుల వ్యాపారికి ఫోన్ చేసిన మాజీ సీఎం కేసీఆర్
సదరు ఫోన్ కాల్ రాజకీయాలకు సంబంధించింది కాదు.. తన సొంత ఫాంహౌస్ పనుల గురించి కావటం ఆసక్తికరంగా మారింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 15 Jan 2024 4:24 AM GMTఅసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి. అనంతరం ఫాంహౌస్ బాత్రూంలో జరిగిన ప్రమాదం.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి.. హైదరాబాద్ లోని నందిహిల్స్ లో కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఒక సామాన్యుడికి ఫోన్ చేశారు. అయితే.. సదరు ఫోన్ కాల్ రాజకీయాలకు సంబంధించింది కాదు.. తన సొంత ఫాంహౌస్ పనుల గురించి కావటం ఆసక్తికరంగా మారింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో ఆసక్తికరంగా మారింది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కోలుకుంటున్న కేసీఆర్.. రానున్నరోజుల్లో రీఎంట్రీ ఇస్తారన్న కథనాలు వస్తున్న వేళ.. అనూహ్యంగా ఆయన.. అన్నదాత అగ్రో ఫర్టిలైజర్ షాపు యజమానికి ఫోన్ చేసి (అతడి దగ్గరే ఎరువులు.. విత్తనాలు కొంటుంటారు) ఫాంహౌస్ కు అవసరమైన విత్తనాలు.. ఎరువుల గురించి చెప్పటం.. మూడు రోజల్లో తాను చెప్పిన సరకు మొత్తం అందాలని చెప్పటం గమనార్హం.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వంటి మామిడి గ్రామానికి చెందిన ఒక ఎరువుల షాపు యజమాని (ఏనుగు బాపురెడ్డి) కి ఫోన్ చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఆయన్ను ఆశ్చర్యానికి గురి చేశారు. పుచ్చకాయ తోటసాగుకోసం అవసరమైన విత్తనాలు.. ఎరువులు.. మల్చింగ్ పేపర్ పంపాలని కోరారు. ఈ సందర్భంగా ఎలా ఉన్నారు? అంటూ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి షాపు యజమాని అడగ్గా.. తాను బాగున్నానని.. వారంలో తాను ఫామ్ హౌస్ కు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.