Begin typing your search above and press return to search.

ఓటమి పాఠాలు నేర్వలేదా కేసీఆర్? ముంచేసిన వాటినే పట్టుకొని వేలాడటమా?

కేసీఆర్ నోటి నుంచి వచ్చిన దళిత బంధు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

By:  Tupaki Desk   |   26 July 2024 4:49 AM GMT
ఓటమి పాఠాలు నేర్వలేదా కేసీఆర్? ముంచేసిన వాటినే పట్టుకొని వేలాడటమా?
X

చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెత వెనకటికి ఒకటి ఉండేది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని తాజాగా విన్నంతనే ఈ సామెత గుర్తుకు రావటం ఖాయం. ఎన్నికల్లో ప్రజలు ఓడించి.. చేతిలో ఉన్న అధికారాన్ని పీకేసిన తర్వాత కూడా ఇప్పటికి తాము నడిచిన మార్గాన్ని.. తమ పాలనను అదే పనిగా పొగుడుకోవటానికి మించిన తెలివితక్కువ పని ఇంకేం ఉంటుంది. ఈ చిన్న లాజిక్ ను గులాబీ బాస్ అదే పనిగా ఎందుకు మర్చిపోతున్నట్లు? పదేళ్లు అద్భుతంగా పాలించిందే నిజమనుకుంటే.. మరోసారి అధికారాన్ని చేతికి ఇవ్వాలే కానీ హ్యాండివ్వకూడదు కదా?

రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత ప్రవేశ పెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ అనంతరం మాట్లాడిన తెలంగాణ విపక్ష నేత కేసీఆర్.. బడ్జెట్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. ఉత్త గ్యాస్ గా అభివర్ణించారు. అంతేకాదు.. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల ప్రస్తావన తీసుకొచ్చి.. వాటి ఊసు రేవంత్ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో లేదంటూ మండిపడ్డారు. అయితే.. ఇక్కడే అసలు విషయాన్ని కేసీఆర్ మిస్ అయ్యారు.

తాము ప్రవేశ పెట్టిన పథకాల్ని గొప్పగా.. అంతకు మించిన అద్భుత సంక్షేమ కార్యక్రమాలు మరొకటి లేవన్నట్లుగా ఫీల్ అయ్యే కేసీఆర్.. నిజానికి ఆ పథకాలు తమను దెబ్బ తీశాయన్న కఠిన వాస్తవాన్ని ఎప్పటికి గుర్తిస్తారు? అన్నది ప్రశ్న. ఉదాహరణకు రైతుబంధు పథకాన్నే తీసుకుందాం. బడా బాబులకు సైతం ఏడాదికి రెండుసార్లు రైతుబంధు డబ్బులు తీసుకోవటంపై చిన్న..సన్నకారు రైతులు ఒక రేంజ్ లో.. కౌలు రైతులు తీవ్రస్థాయిలో చిరాకు పడిపోవటాన్ని కేసీఆర్ గుర్తించకపోవటం ఒక వైఫల్యంగా చెప్పాలి. తనకు తాను రైతుబంధు అద్భుత పథకంగా అబివర్ణించుకోవటంలోనే ఆయన వైఫల్యం దాగి ఉందని చెప్పాలి.

కేసీఆర్ నోటి నుంచి వచ్చిన దళిత బంధు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దీనికి కారణం ఈ పథకం మీద ఆయా వర్గాల్లోనూ తీవ్రఆగ్రహం ఉంది. ఎందుకుంటే ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేయాలంటే ఒక పెద్ద ఫార్సుగా ఉండటమే కాదు.. ఎవరైతే కప్పం చెల్లిస్తారో వారికే దళితబంధు డబ్బులు చేతికి వచ్చే పరిస్థితి. ఇదొక ఇబ్బంది అయితే.. ఈ పథకం కింద డబ్బులు చేతిలో పడినోళ్లు గుప్పెడు మంది అయితే.. చేతికి రానోళ్లు బోలెడంత మంది. పథకాల లబ్థి పొందిన వారు కాస్తంత సానుకూలంగా ఉన్నా.. రానోళ్లు ప్రతికూలంగా ఉండటం కేసీఆర్ ప్రభుత్వానికి శాపంగా మారింది.

ఇక.. గొర్రెల పంపిణీతో పాటు.. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాల్ని ప్రస్తావిస్తున్న కేసీఆర్ ఒక లాజిక్ ను మర్చిపోతున్నారు. నిజంగానే తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సూపర్ హిట్ అయితే.. అధికారం తమ చేతిలోనే ఉండి ఉండేది కదా? కానీ.. అలా జరగలేదంటే తాము మురిసిపోతున్న పథకాలు తమను ముంచేసి ఉంటాయన్న వాస్తవాన్ని ఎప్పటికి గుర్తిస్తారు? అప్పుడు కానీ.. అసలు విషయాల్ని ఆలోచించటమే కాదు.. రేవంత్ సర్కారు వ్యూహాలకు చెక్ చెప్పే వీలుంటుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి తమ ప్రభుత్వం గొప్పల మత్తులో ఉన్న కేసీఆర్ కు ఈ వాదనలోని మర్మం ఎప్పటికి అర్థమవుతుందో?