Begin typing your search above and press return to search.

ప్రజాస్వామ్యం పరిణతి మీద కేసీయార్ కామెంట్స్... ఎందువల్ల...?

భారతదేశం ప్రజాస్వామ్యం చూసి పాశ్చాత్య దేశాలు ఆశ్చర్యపోతూ ఉంటాయి. ఇపుడంటే అక్షరాస్యత బాగా పెరిగింది.

By:  Tupaki Desk   |   18 Nov 2023 3:31 AM GMT
ప్రజాస్వామ్యం పరిణతి మీద కేసీయార్ కామెంట్స్... ఎందువల్ల...?
X

భారతదేశం ప్రజాస్వామ్యం చూసి పాశ్చాత్య దేశాలు ఆశ్చర్యపోతూ ఉంటాయి. ఇపుడంటే అక్షరాస్యత బాగా పెరిగింది. కానీ ఇప్పటికి నలభై యాభై ఏళ్ల క్రితమే తమకు నచ్చని ప్రభుత్వాన్ని నిర్ధాక్షిణ్యంగా దించడంలో భారత ఓటర్లు విజయం సాధించారు. నూటికి అరవై శాతంగా నిరక్షరాస్యత ఉన్న కాలంలోనే ప్రభుత్వాలను మార్చిన శక్తి ఓటరుకు ఉంది అనిపించారు.

అలా ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ తరువాత ఓడించారు. జనతా ప్రభుత్వంలో అనైక్యత ఉండి కూలిపోతే అస్థిర ప్రభుత్వాలు వద్దు అని మళ్ళీ కాంగ్రెస్ ని తెచ్చారు. రెండు సీట్లకు పరిమితం అయిన బీజేపీని ఇప్పటికి నాలుగు సార్లు ఎన్నుకున్నారు. ఈ మధ్యలో సంకీర్ణ ప్రభుత్వాలను కూడా చూసి తిరస్కరించారు.

అవినీతి ఆరోపణలు ఉంటే ఏమాత్రం ఉపేక్షించలేదు. నాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఆ తరువాత యూపీయే టూ ప్రభుత్వాన్ని కూడా ఓడించిన ఘనత దేశంలోని ఓటర్లకే దక్కుతుంది. ఇక తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజలే నాటి టీయారెస్ కి తొలి తాంబూలం ఇచ్చి అందలం ఎక్కించారు.

అదే విధంగా రెండవమారు తెలంగాణా సెంటిమెంట్ అంటే నిండుగా మద్దతు ఇచ్చారు. ఇపుడు పదేళ్ళు దాటింది అభివృద్ధిని కొలమానంగా చూసి ఓటేయనున్నారు. అలాంటి ప్రజాస్వామ్యం మీద ఇటీవల కాలంలో బీయారెస్ అధినేత కేసీయార్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పరిణతి అనుకున్న విధంగా రావడంలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ సభలో అదే మాట్లాడారు.

ఇతర దేశాలలో పాలసీల మీద డిబేట్లు ఉంటాయి. అభివృద్ధిని చూసి ఓటేస్తారు అని ఆయన అంటున్నారు. కానీ భారత దేశంలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఎన్నో ఎత్తులు వ్యూహాలు వేస్తూ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూంటాయి. తస్మాత్ జాగ్రత్త అని కేసీయార్ హెచ్చరిస్తున్నారు.

ఓటర్లు ఏమరుపాటుగా ఉంటే ఇబ్బంది వస్తుందని అంటున్నారు. కేసీయార్ ఈ విధంగా ఎందుకు చెబుతున్నారు అన్నదే ఇపుడు అందరికీ పట్టుకున్న డౌట్. ఎందుకంటే బీయారెస్ కి గెలుపు ధీమా ఉన్నపుడు ఇవన్నీ అనవసరం. కాంగ్రెస్ కి ఓటేయవద్దు నమ్మవద్దు అని పదే పదే అంటున్నారు అంటే ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది అని భావిస్తున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్నగా వస్తోంది.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె తో పాటు రాహుల్ గాంధీ కూడా తెలంగాణా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈసారి ఓడిపోతామన్నది కేసీయార్ కి తెలుసు అని అంటున్నారు. మరి వారు అన్నది నిజమా. అయినా కూడా ఎన్నడూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడని కేసీయార్ ఇపుడు ఎందుకు ఆవేదన చెందుతున్నారు, ఇంతకీ ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదం ఏంటి అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం.

ప్రజలు ఎపుడూ చైతన్యవంతంగానే ఉంటారు. వారి తీర్పు తప్పు అని అన్న వారే ఓటమిని జీర్ణించుకోలేని వారు అవుతారు అంటారు. ప్రజలు ఎన్నో ఆలోచించి ఓటేస్తారు. అయిదేళ్ళ కాలానికే వారు అధికారం ఇస్తారు. బీయారెస్ కి కూడా ఇదే ప్రజలు రెండు సార్లు అధికారం ఇచ్చారు అన్నది కూడా మరువరాదు అని అంటున్నారు. అయితే ఈసారి కూడా ఎవరికి అధికారం ఇస్తారో ఇంకా తేలాల్సి ఉంది. ఆదికి ముందే ప్రజాస్వామ్యం పరిణతి అని కేసీయార్ అనడం పట్ల అయితే చర్చ సాగుతోంది. మరి ఆయన అలా అనడం వెనక ఏ వ్యూహాలు ఉన్నాయో చూడాల్సి ఉంది.