Begin typing your search above and press return to search.

తెచ్చుడు మాటలు చెప్పే కేసీఆర్.. ఇచ్చుడు మాటల మాటేంది?

ఇదంతా ఇప్పుడెందుకు? తెలంగాణ వచ్చేసింది. పదేళ్ల తర్వాత ఈ చర్చ అవసరమా? అంటే అవసరమేనని చెప్పాలి.

By:  Tupaki Desk   |   7 May 2024 11:30 AM GMT
తెచ్చుడు మాటలు చెప్పే కేసీఆర్.. ఇచ్చుడు మాటల మాటేంది?
X

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. చేజారిన తర్వాత మరోలా వ్యవహరించే కేసీఆర్ లో ఏ టైంలో అయినా మారని వైనం ఏమైనా ఉందంటే.. అది తెలంగాణ సాధనలో తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం. తాను లేకుంటే తెలంగాణ రాదన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ఆయన మాటల్ని పదేళ్లుగా వింటున్న వారికి కలిగే సందేహాల్ని ఇప్పటికైనా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. తన మాటల భ్రమలో ప్రజల్ని ముంచెత్తే కేసీఆర్.. తాను తప్పించి మరెవరూ గొప్ప కాదన్న అహంభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.

తాను పోరాడి సాధించిన తెలంగాణ అని నిత్యం చెప్పుకునే కేసీఆర్ కు.. ఒక సూటి ప్రశ్న. ఏళ్లకు ఏళ్లుగా పోరాడుతున్నా.. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఫిక్స్ కాకుంటే ఏం చేసేవారు? తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న విషయంలో విశాల మనసుతో ముందుకు వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందే కానీ.. ఆమె కానీ ఏది ఏమైనా ఇచ్చేది లేదని ఫిక్స్ అయితే.. వంద కేసీఆర్ లు కలిసినా సాధ్యమయ్యేదా?

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదేళ్లు వ్యవహరించిన కేసీఆర్.. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని.. విమర్శలు చేసిన వారిని.. ఆందోళనలు చేపట్టిన వారిని ఎంత కఠినంగా అణిచివేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనే అంత పవర్ చూపించినప్పుడు.. అపరిమిత అధికారులు ఉన్న కేంద్రం తెలంగాణ ఇచ్చుడు విషయంపై ససేమిరా అని ఫిక్స్ అయి ఉంటే.. కేసీఆర్ జీవితంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూసి ఉండేవారా?

ఇదంతా ఇప్పుడెందుకు? తెలంగాణ వచ్చేసింది. పదేళ్ల తర్వాత ఈ చర్చ అవసరమా? అంటే అవసరమేనని చెప్పాలి. తన చేతికి అధికారం రావటం కోసం అడ్డగోలు మాటలు మాట్లాడే కేసీఆర్ మాటలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. లేదంటే.. తనకున్న టాలెంట్ తో ప్రజల్ని తప్పుడు మార్గాన నడిచేలా చేస్తారు. అధికారం తప్పించి మరింకేమీ అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించే గులాబీ బాస్.. తెచ్చుడు గొప్పతనం గురించి అదే పనిగా గొప్పలు చెప్పుకోవటం సరే. మరి.. ఇచ్చినోళ్లు మరెంతగా చెప్పుకోవాలి. ఇచ్చిన వారి గొప్పతనాన్ని ప్రజలు గుర్తించకుండా ఉండేందుకు కేసీఆర్ తెచ్చుడు మాటలతో క్రెడిట్ అంతా తన ఖాతాలోకి వేసుకోవాలన్న ఆత్రుతను అర్థం చేసుకోవచ్చు. తేవటం అంటే ఆషామాషీ కాదనే కేసీఆర్.. ఇచ్చుడు అంతకంటే పెద్దదన్న విషయాన్ని ఇప్పటికైనా ఒప్పుకోవాలి. లేదంటే.. ఆయన తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్య పెడుతున్నట్లుగా పరిగణించక తప్పదు. కాదంటారా?