కేసీయార్...చంద్రబాబు చేసిన తప్పే చేస్తున్నారా...?
అయినా సరే వాటిని ఏ మాత్రం గమనించకుండా మనమే గెలుస్తున్నామని వంద సీట్లకు తగ్గవని మభ్యపెట్టడం ద్వారా చివరికి అసలుకే ఎసరు వస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.
By: Tupaki Desk | 25 Oct 2023 10:50 AM GMTకేసీయార్ లో చంద్రుడు ఉన్నాడు. చంద్రబాబులోనూ ఉన్నాడు. ఇద్దరూ రాజకీయంగా చూస్తే గండర గండలుగానే చెప్పుకోవాలి. ఇద్దరి వ్యూహాలూ ఎత్తులు పై ఎత్తులూ ఎవరికీ అర్ధం కావు. చాణక్య రాజకీయానికి ఇద్దరు చంద్రులు పెట్టింది పేరు. తమదైన రాజకీయంతో ఇద్దరు నేతలూ అనేక సార్లు రాజకీయంగా లాభాలనే పొందారు. కొన్ని సార్లు ఎదురుదెబ్బలూ తగిలాయి.
రాజకీయం అంటేనే అది. ఎపుడూ సక్సెస్ వెంట రాదు. ఓటములూ ఎదురవుతాయి. దానికి కారణం ఆత్మ విశ్వాసం తగ్గినా లేక అతి విశ్వాసం హెచ్చినా కూడా పాలిటిక్స్ ఉల్టా సీదా అవుతుంది. అంతే కాదు పాలిటిక్స్ లో ట్రిక్స్ కూడా కొన్ని సార్లు పనిచేయకుండా పోతాయి. అలా 2019 ఎన్నికల్లో ఎంతో ధీమాతో బరిలోకి దిగిన చంద్రబాబుకు చివరికి ఫలితాలు చుక్కలు చూపించాయి. దానికి కారణం చంద్రబాబు అప్పటికే తన చూపు ఆలోచనలు ఒక వైపే పెట్టడం
తాను ఓడడం జరగదు అని భరోసాతో ఉండడం, తన అనుకూల మీడియా ఇచ్చే సర్వేలనే నమ్మడం. జాతీయ స్థాయిలో వచ్చిన సర్వేలను పూర్తిగా పక్కన పెట్టడం. దాంతో ఆయన అనుకున్నది ఒకటి అయితే గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్నది మరొకటి అయింది. దాంతోనే 2019 నాటి ఫలితాలను చంద్రబాబు ఈ రోజుకీ డైజెస్ట్ చేసుకోని పరిస్థితి ఏర్పడింది. నేను ఎందుకు ఓటమి పాలు అయ్యాను అన్నది కూడా అర్ధం కావడంలేదు అంటున్నారు.
సీన్ కట్ చేస్తే తెలంగాణాలో మరో చంద్రుడు కేసీయార్ ఉన్నారు. ఆయన కూడా అచ్చంగా చంద్రబాబు బాటలో నడుస్తున్నారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఎందుకంటే ఒక వైపే చూడు, మనకు మద్దతుగా ఉన్నది మనకు నచ్చిన సర్వేలనే నమ్ముకో అన్న ఫిలాసఫీనే కేసీయార్ అనుసరిస్తున్నారా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ముందుకు వస్తోంది.
లేకపోతే ఇప్పటిదాకా వచ్చిన అనేక జాతీయ సర్వేలు కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో కచ్చితంగా గెలుస్తుంది అని చూపిస్తున్నాయి. పదే పదే అదే విషయాన్ని బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. అయితే కేసీయార్ వాటి మీద ఫోకస్ పెట్టినట్లుగా కనిపించడంలేదు, అంతే కాదు ఆయన పక్కా లోకల్ సర్వేలను నమ్ముకున్నట్లుగా ఉంది అని అంటున్నారు.
ఈ సర్వేలు ఎలా ఉంటున్నాయంటే జై కేసీయార్ అని సాగిపోతున్నాయి. అసలు వాస్తవాలు మరుగున పెడుతూ మళ్ళీ వచ్చేది బీయారెస్ అంటూ తమకు తోచిన బిగ్ నంబర్స్ ని ఇస్తూ పోతున్నాయని అంటున్నారు. లాజిక్ కి అందని ఈ తరహా సర్వేలు బీయారెస్ నేతలకు ఇపుడు ఫుల్ ఖుషీని ఇస్తున్నాయి కానీ నిజంగా క్షేత్ర స్థాయిలో అటువంటి పరిస్థితి ఉందా అన్నదే అతి పెద్ద డౌట్ గా ఉంది.
ఇక ఈ తరహా సర్వేలను నమ్మడం వల్ల బొక్క బోర్లా పడడం తప్ప వేరే ఉపయోగం లేదని అంటున్నారు. ఒక వైపు బీయారెస్ లో క్యాడర్ పూర్తిగా అసంతృప్తిగా ఉంది అని అంటున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. జనంలో కూడా యాంటీ ఇంకెంబెన్సీ పుణ్యమాని వ్యతిరేకత ఒక లెవెల్ లో ఉంది.
అయినా సరే వాటిని ఏ మాత్రం గమనించకుండా మనమే గెలుస్తున్నామని వంద సీట్లకు తగ్గవని మభ్యపెట్టడం ద్వారా చివరికి అసలుకే ఎసరు వస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. జాతీయ సర్వేలను ప్రమాణంగా ఎందుకు తీసుకుంటారు అంటే వారికి లోకల్ పాలిటిక్స్ తో సంబంధం ఉండదు, వారికి మమకారాలు అహంకారాలు ద్వేషాలు ఒక పార్టీ మీద ఎక్కువ మరో పార్టీ మీద తక్కువ అని ఉండవు.
పైగా జాతీయ స్థాయిలో తమ ఇమేజ్ ని కూడా అవి చూసుకుంటూ వీలైనంతవరకూ సైంటిఫిక్ గానే సర్వే నివేదికలు ఇస్తాయి. వాటిని ఎక్కువగా నమ్మాల్సి ఉంటుంది అందుకే. ఇక పోనీ బీయారెస్ గెలుస్తుందని లోకల్ సర్వేలు ఎంత చెప్పినా జాతీయ సర్వేలను కూడా దగ్గర పెట్టుకుని లోటు పాట్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటికైనా మధింపు చేసుకుంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అని అంటున్నారు. అలా కాకుండా మేమే గెలుస్తున్నామని సెంచరీ పక్కా అనుకుంటూ అతి ధీమాకు పోతే ఏపీలో 2019లో చంద్రబాబుకు కొట్టిన భారీ షాక్ తెలంగాణాలో బీయారెస్ కి కూడా తప్పదా అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయట.