బెంజ్ కారు, చేతికర్ర... అసెంబ్లీకి కేసీఆర్ కొత్త ఎంట్రీ వైరల్!
ముందుగా అనుకున్నట్లుగానే బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
By: Tupaki Desk | 1 Feb 2024 9:38 AM GMTముందుగా అనుకున్నట్లుగానే బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా... గురువారం మధ్యాహ్నం 12:45 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. కేసీఆర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కొత్త బెంజ్ కారులో దిగిన కేసీఆర్... చేతిలో కర్ర పట్టుకుని నడుచుకుంటూ అసెంబ్లీ లోనికి వచ్చారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
అవును... గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్... ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీ వచ్చారు. గతానికి భిన్నంగా వినూత్నంగా కొత్త కారులో దిగారు.. అనంతరం చేతికర్ర సాయంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. దీంతో... గతంలో అసెంబ్లీకి ఎంటరైనప్పటి కేసీఆర్ ని తలచుకుంటూ.. ఇప్పుడు నడిచి వస్తున్న కేసీఆర్ ని చూస్తూ... విభిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
ఐదుగురు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు డుమ్మా!!:
తుంటి ఎముకకు ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్... ఇటీవల కాస్త కోలుకోవడంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు అన్నట్లుగా అనారోగ్యాన్ని కూడా కేసీఆర్ పక్కనపెట్టారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో కేసీఆర్ ప్రమాణస్వీకారానికి బీఆరెస్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు పెద్దలు, నేతలు హాజరయ్యారు. ఇదే సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి బీఆరెస్స్ ద్వితీయ శ్రేణి నేతలతోపాటు కార్యకర్తలు హాజరయ్యారు! అయితే... ఈ కార్యక్రమానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు గౌర్హాజరవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో భాగంగా... ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, పద్మారావులు కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే వీరిలో కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ ఎమ్మెల్యేల గైర్హాజర్ పై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
బర్త్ డే రోజున అభ్యర్థుల ప్రకటన!:
ఇక ఈ నెల 17న కేసీఆర్ బర్త్ డే కావడంతో... అదే రోజున బీఆరెస్స్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో లోక్ సభ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించడం.. అసెంబ్లీ స్థానాల్లో కార్యకర్తల సమావేశాలు జరుపుతుండటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... కేసీఆర్ ఎంట్రీతో కేడర్ లో మరింత ఉత్సాహం రావొచ్చని అంటున్నారు.
ఈ సందర్భంగా... "సారు.. కారు.. పదహారు" నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది బీఆరెస్స్. ఇందులో భాగంగా... "తెలంగాణ గళం.. తెలంగాణ దళం.. తెలంగాణ బలం బీఆరెస్స్" అంటూ లోక్ సభ ఎన్నికలపై పూర్తిస్తాయిలో దృష్టిసారించింది. ఈ సమయంలో కేసీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.