కేసీఆర్ ఫ్యామిలీకి ఇంటి కష్టం .. ఇప్పుడిదే హాట్ టాపిక్
సకల సౌకర్యాలతో ఫామ్ హౌస్ ఉన్నప్పటికీ.. బాత్రూంలో జారి పడి.. గాయపడిన కేసీఆర్ హైదరాబాద్ లో ఉండాల్సిన వేళలో.. ఇంటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొన్నారు
By: Tupaki Desk | 22 Aug 2024 6:30 AMపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు అంటూ.. ఆత్మగౌరవ ట్యాగ్ లైన్ తో లక్షలాది ఇళ్లు కట్టి.. పదేళ్లు అధికారంలో ఉండి కూడా వేలాది ఇళ్లు ఇవ్వకుండా అట్టే ఉంచేసిన వైనం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తామేనని.. తెలంగాణ చాంఫియన్లుగా తమను తాము చెప్పుకునే గులాబీ బాస్ కేసీఆర్ కు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం హాట్ టాపిక్ గా మారింది. పదేళ్లు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన కేసీఆర్ కుటుంబానికి ఇంటి కష్టం అదే పనిగా వెంటాడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే విషయం సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చగా మారింది.
కేసీఆర్ కు హైదరాబాద్ లోని నందినగర్ (బంజారాహిల్స్)లో సొంతిల్లు ఉండటం తెలిసిందే. అయితే.. ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. యుద్ధ ప్రాతిపదికన భారీ రాజసౌధాన్ని నిర్మించుకొని.. దానికి ప్రగతిభవన్ పేరు పెట్టి.. అందులో ఉండటం తెలిసిందే. పదేళ్లు అధికారంలో ఉన్నంతవరకు ప్రగతి భవన్ పుణ్యమా అని ఇంటి సమస్య ఎదురు కాలేదు. ఎప్పుడైతే ఆయన చేతి నుంచి అధికారం చేజారితో ఇంటి సమస్య తెగ ఇబ్బంది పెడుతోంది.
సకల సౌకర్యాలతో ఫామ్ హౌస్ ఉన్నప్పటికీ.. బాత్రూంలో జారి పడి.. గాయపడిన కేసీఆర్ హైదరాబాద్ లో ఉండాల్సిన వేళలో.. ఇంటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఈ సందర్భంలో తాను నిర్మించిన కొత్త ఇంటిని తీసుకోవాలంటూ అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆఫర్ ఇవ్వటం.. ఆ తర్వాత అది కాస్తా ఆగటం తెలిసిందే. తర్వాతి కాలంలో దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు.
కేసీఆర్ సంగతి ఇలా ఉంటే.. ఆయన కుమార్తె కవిత కొత్త ఇంటిని తన అభిరుచికి తగ్గట్లు నిర్మించుకున్నారు. ఆ ఇంట్లోనే నివాసం ఉన్న ఆమె.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉండటం తెలిసిందే. దీంతో.. ఆమెకు ఇంటి కష్టం తప్పట్లేదు.
ఇక.. కేటీఆర్ విషయానికి వస్తే.. నగర శివారులోని జన్వాడలో ఉంటున్న ఫాంహౌస్ ఇప్పుడు వివాదంగా మారింది. తనకుతానే ఓపెన్ అయిన కేటీఆర్.. సదరు జన్వాడ ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని.. తాను ఉండేందుకు లీజుకు తీసుకున్నట్లుగా పేర్కొంటూ.. అదంతా ఎనిమిది నెలల నుంచే.. తాను జన్వాడ ఫామ్ హౌస్ లో ఉంటున్నట్లుగా మీడియా సమావేశంలో వెల్లడించారు కేటీఆర్. ఇలా గులాబీ బాస్ కుటుంబ సభ్యులందరికి ఏదోలా ఇంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరగటం విశేషం.