Begin typing your search above and press return to search.

తనయుడు, అల్లుడిలో జోష్ నింపిన కేసీఆర్

తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఇన్ని రోజులు తెరవెనుక మంతనాలు జరిగిన ఈ బావ బావమరుదులు ఇప్పుడు ఎన్నికల క్షేత్రంలో పార్టీ విజయం కోసం పోరాడేందుకు సిద్ధమయ్యారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 2:30 PM GMT
తనయుడు, అల్లుడిలో జోష్ నింపిన కేసీఆర్
X

తెలంగాణలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమరంలో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందంటే అభ్యర్థి ఎవరనేది పక్కన పెట్టి ముందు కేసీఆర్ ను చూసే ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కూడా అదే చరిష్మాను కొనసాగిస్తూ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకెళ్తున్నారు. ఇన్ని రోజులు వైరల్ ఫీవర్ తో బాధపడ్డ ఆయన.. ఇప్పుడు పూర్తిగా కోలుకుని ప్రచార సభలను హోరెత్తిస్తున్నారు. తాజాగా తనయుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లా, మేనల్లుడు హరీష్ రావుకు కంచు కోట అయిన సిద్ధిపేటలో ఒకే రోజు రెండు సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు.

బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత కీలక నాయకులు అంటే కేటీఆర్, హరీష్ రావు. తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఇన్ని రోజులు తెరవెనుక మంతనాలు జరిగిన ఈ బావ బావమరుదులు ఇప్పుడు ఎన్నికల క్షేత్రంలో పార్టీ విజయం కోసం పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ పోరును ముందుగా తమ నియోజకవర్గాల నుంచే ప్రారంభించారు. ముందుగా కేసీఆర్ వచ్చి తమ నియోజకవర్గాల సభల్లో పాల్గొంటే.. అనంతరం వీళ్లిద్దరూ రాష్ట్రవ్యాప్తంగా ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయొచ్చన్నది వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ రాకముందు వివిధ డెవలప్మెంట్ పనుల్లో భాగంగా కేటీఆర్, హరీష్ వివిధ కార్యక్రమాల పేరుతో రాష్ట్రాన్ని చుట్టేశారు. ఇప్పుడికి అభ్యర్థుల ప్రచారం వీళ్లిద్దరూ కీలకం కానున్నారు.

కేసీఆర్ సభలతో ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్న కేటీఆర్, హరీష్ రావు ఇదే దూకుడుతో ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాగో సిరిసిల్లాలో కేటీఆర్ కు, సిద్ధిపేటలో హరీష్ రావుకు తిరుగులేదన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు నాయకులు గెలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా నియోజకవర్గాలపై ఈ ఇద్దరు కీలక నేతలు ఫోకస్ పెట్టారనే చెప్పాలి. ఇక ఇతర అభ్యర్థుల విజయం కోసం వీళ్లు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సై అంటున్నారు. ఆయా అభ్యర్థుల తరపున ప్రచారం చేసి పార్టీని మూడోసారి అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో సాగుతున్నారనే చెప్పాలి.