Begin typing your search above and press return to search.

కెలికి మరీ కంపు చేసుకోవటం ఏంది కేసీఆర్?

శుకునం చెప్పే బల్లి కుడితిలో పడిన చందంగా మారింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు చూస్తుంటే.

By:  Tupaki Desk   |   20 April 2024 5:30 AM GMT
కెలికి మరీ కంపు చేసుకోవటం ఏంది కేసీఆర్?
X

శుకునం చెప్పే బల్లి కుడితిలో పడిన చందంగా మారింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు చూస్తుంటే. ఒక్కోసారి మనం ఎంత శక్తివంతులమైనా.. మేధావులమైనా.. కాలం సహకరించకుంటే తిప్పలు తప్పవు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. రాజకీయాల్లో ఏమైనా చేయొచ్చు. కానీ.. అందుకు ప్రజల్లో మంచి పలుకుబడి ఉండాలి. తన పదేళ్ల పాలనతో తెలంగాణ ప్రజలకు మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చిన కేసీఆర్.. తనను తాను ఎంత గొప్పగా ఊహించుకున్నా.. అలాంటి భావన ప్రజల్లో లేదన్న విషయాన్ని గ్రహించనంతకాలం ఆయనకు ఎదురుదెబ్బలు తప్పవన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఐదేళ్ల పాలనా అధికారం ఉన్నప్పుడు.. దాన్ని మూడు నెలల్లో కూల్చేస్తామన్న మాటలతో మేలు కంటే చేటు చేస్తాయన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారు. ఆ మాటకు వస్తే కేసీఆర్ మాత్రమే కాదు.. ఆయన కుటుంబసభ్యులు సైతం ఇదే ఇబ్బందిలో ఉన్నారు. ఓటమి ఎదురై నాలుగు నెలలు అవుతున్నా.. తమ ఓటమికి కారణం ప్రజలు తప్పు చేయటమే తప్పించి.. తాము ఎలాంటి తప్పులు చేయలేదన్న భావనలో వారు ఉండటం అసలు సమస్య.

అదే సమయంలో తమకు సాటి వచ్చే వారు లేరని.. అలాంటి వేళ.. రేవంత్ లాంటి ఒక ‘లిల్లీఫుట్’ తమకు సవాలు విసరటం ఏమిటి? తాము కట్టుకున్న రాజకోట నుంచి తమను బయటకు పంపటం ఏమిటి? అన్నది జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయాల్లో ఇదెప్పుడూ జరిగేదే. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలే కానీ.. సామాన్యుడు సైతం పవర్ ఫుల్ గా మారిపోతారు. రేవంత్ విషయంలో జరిగింది ఇదే. నిజానికి రేవంత్ ను పెంచి పెద్ద చేసింది కేసీఆరేనని చెప్పాలి.

ఒక వేటగాడి మాదిరి రేవంత్ ను వేటాడి వెంటాడిన కేసీఆర్.. ఆయన మరింత రాటు తేలేలా చేశారు. చూపించాల్సిన సినిమా అంతా మొదట్లోనే చూపించేయటంతో రేవంత్ కు అన్ని విషయాలు అర్థమయ్యాయని చెప్పాలి. కేసీఆర్ కారణంగా రేవంత్ మరింత బలపడటమే కాదు.. తనలోని లోపాల్ని అధిగమించి.. తనను తాను అప్డేట్ చేసుకోవటమే కాదు.. కొత్త వెర్షన్ లోకి వెళ్లిపోయారు. ఒక విధంగా చూస్తే.. రేవంత్ ఏఐ వెర్షన్ లోకి వెళితే.. కేసీఆర్ మాత్రం తన స్కూల్ లోనే ఉండిపోయారు. జమానా నాటి వెర్షన్ లో ఉండిపోయి.. ఏఐతో పోటీ పడాలని చూస్తున్నారు.

ఈ కారణంతోనే తన నోటికి పని చెప్పి అడ్డదిడ్డంగా నాలుగు మాటలు అనేస్తున్న కసీఆర్.. తనను నలభై మాటలు అనే అవకాశాన్ని రేవంత్ కు ఇస్తున్నారు. సాధారణంగా అధికారపక్షంలో ఉన్న వారు తమ అధికారాన్ని.. అహంకారాన్ని చూపించటం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత కొని తెచ్చుకుంటారు. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న రేవంత్.. తాను వేసే ప్రతి అడుగును ఆచితూచి అన్నట్లుగా వేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థిని ఇరిటేట్ చేయటం ద్వారా కేసీఆర్ బరస్ట్ అయ్యేలా చేస్తున్నారు.

దీన్ని అర్థం చేసుకోలేని కేసీఆర్.. రేవంత్ ట్రాప్ లో పడిపోతున్నారు. తన నోటి నుంచి నాలుగు మాటలు వచ్చేలా చేస్తున్న రేవంత్.. ఆ వెంటనే రియాక్టు కావటం.. నలభై మాటలతో కేసీఆర్ ను ఉతికి ఆరేస్తున్నారు. సామాన్యులు సైతం కేసీఆర్ అన్నందుకే కదా? రేవంత్ అన్నేసి మాటలు అంటున్నదన్న భావనకు వస్తున్నారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చిన రోజులోనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను హస్తం గూటికి తీసుకురావటం చూసినప్పుడు.. కేసీఆర్ కాలు దువ్వారు.. దానికి రేవంత్ బదులిచ్చారన్న భావన ప్రజల్లో కలిగేలా చేస్తున్నారు. ఇదంతా చూస్తే.. రేవంత్ ఏఐ వెర్షన్ ను ఢీ కొట్టాలంటే సరికొత్త సాఫ్ట్ వేర్ ను కేసీఆర్ క్రియేట్ చేయాల్సిందే. లేకుంటే తిప్పలు తప్పవు.