Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల దెబ్బ... జీవోలు ఫటా ఫట్ వస్తున్నాయి!

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మీపిస్తున్న నేప‌థ్యంలో విద్యా శాఖ‌లో వ‌రుస ఉత్తర్వులు వెలువ‌డ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:30 PM GMT
ఎన్నిక‌ల దెబ్బ... జీవోలు ఫటా ఫట్ వస్తున్నాయి!
X

తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. మ‌రో రెండు నెలల్లోనే ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో మూడోసారి అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్‌.. ముందుగా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించిన‌ట్లు తెలిసింది. ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి ఎలాంటి పెండింగ్ ప‌నులు లేకుండా చూసుకుని, ఓట్ల వేట‌కు సిద్ధ‌మ‌వ్వాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అందుకు ముందుగా ఆయ‌న విద్యాశాఖ‌పై ఫోక‌స్ పెట్టార‌ని స‌మాచారం.

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మీపిస్తున్న నేప‌థ్యంలో విద్యా శాఖ‌లో వ‌రుస ఉత్తర్వులు వెలువ‌డ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఒక్కో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం జీవోలు విడుద‌ల చేయ‌డంలో వేగాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని టాక్‌. గ‌తంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకునే క్ర‌మంలోనే ఇదంతా జ‌రుగుతున్న‌ట్లు తెలిసింది.

2019-20 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న విద్యా వాలంటీర్ల రెండు నెల‌ల జీతాన్ని వెంట‌నే చెల్లించేందుకు నిధులు విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. మ‌హ‌బూబాబాద్‌, ఖ‌మ్మంలో సీఎం ప‌ర్య‌టించిన‌ప్పుడు రెండు ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు మంజూరు చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

ఇప్పుడు వీటికి సంబంధించిన ప్ర‌క్రియ వేగ‌వంతంగా జ‌రుగుతోంది. వికారాబాద్‌లోని దౌల్తాబాద్‌, కామారెడ్డిలోని బీబీపేట‌లో ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ల కోసం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇలా పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌న్నింటినీ ఎన్నిక‌ల లోపు పూర్తి చేసేందుకు కేసీఆర్ క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని తెలిసింది.