మోడీకి కేసీఆర్ కి ఉన్న ఎమోషనల్ ఓటు పోయిందా ?
ఇక ఎమోషనల్ కనెక్షన్ తోనే మోడీ అయినా కేసీఆర్ అయినా చాలా కాలం రాజకీయాలు చేశారు అని అంటారు.
By: Tupaki Desk | 15 July 2024 2:03 AM GMTఒకే సమయంలో కేంద్రంలో మోడీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇద్దరూ రెండు సార్లు గెలిచారు. అయితే మూడవసారి కేసీఆర్ ఓటమి చెంది ప్రతిపక్షానికి పరిమితం అయితే బీజేపీ మాత్రం సొంతంగా మెజారిటీ రాని నేపధ్యంలో మిత్రుల మీద ఆధారపడి అధికారాన్ని దక్కించుకున్నది.
ఇక ఎమోషనల్ కనెక్షన్ తోనే మోడీ అయినా కేసీఆర్ అయినా చాలా కాలం రాజకీయాలు చేశారు అని అంటారు. ప్రజలతో ఆ విధమైన బాండింగ్ కానీ ఎమోషనల్ టచ్ కానీ వారు ఏర్పాటు చేసుకుని వరస విజయాలను అందుకున్నారు అన్నది ఒక విశ్లేషణ.
అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ అయితే ఓటమి చెంది విపక్ష నేతగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని నడిపిస్తున్న మోడీకి మాత్రం అపజయాలు ఎదురవున్నాయి. తాజాగా జరిగిన 13 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే బీజేపీ దక్కించుకుంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి అన్న చర్చ అయితే తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
దీని కంటే ముందే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే నరేంద్ర మోడీకి కన్ను లొట్టబోయిన చందంగా రిజల్ట్ దక్కింది. సింపుల్ మెజారిటీని సైతం అందుకోలేని విధంగా బీజేపీ పరిస్థితి తయారైంది. దాంతో తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు, బీహార్ కి చెందిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ ల సహకారంతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణాలో చూసుకుంటే కేసీఆర్ కి రెండు సార్లు కలసివచ్చిన తెలంగాణా వాదం భావ జాలం సెంటిమెంట్ అంతా కూడా ఒక్కసారిగా ఎగిరిపోయింది. అందుకే 2023 చివరలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి పాలు అయ్యారని అంటారు. ఇక ఏపీలో చూస్తే వైఎస్సార్ సెంటిమెంట్ గట్టిగా పని చేయబట్టే జగన్ ఏపీకి ఒకసారి సీఎం అయ్యారు అని అంటున్నారు. అది కాస్తా 2024 ఎన్నికల్లో గాయబ్ కావడంతో జగన్ సైతం మాజీ సీఎం కావాల్సి వచ్చిందని అంటున్నారు.
ఇక ఇపుడు జాతీయ స్థాయిలో ఉప ఎన్నికల ఫలితాలు చూసినా సెంటిమెంట్లు ఏవీ లేవు కేవలం అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేస్తున్నారు అని అర్ధం అవుతోంది. ఈ నేపధ్యంలో ప్రజలకు హిందూత్వ సెంటిమెంట్ తో టచ్ లోకి వచ్చిన బీజేపీకి 2024 ఎన్నికల ఫలితాలు కానీ తాజా ఉప ఎన్నికల రిజల్ట్స్ కానీ శరాఘాతమే అని అంటున్నారు. బీజేపీ నమ్ముకున్న సెంటిమెంట్ అలాగే ఆ పార్టీ మొదటి నుంచి తన సీట్ల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్న అమ్ములపోదిలోని అస్త్రం కానీ ఈసారి ఎందుకో పనిచేయడం మానేసింది.
దేశంలో మెజారిటీ ప్రజలు మైనారిటీలు అంటూ ఎంతగా గొంతు చించుకున్నా కూడా ఓట్లు రాలడం లేదు. అదే సమయంలో రామాలయం నిర్మాణం జరిపిన అయోధ్యలోనూ బీజేపీ ఓటమి పాలు కావడం కొత్త్త ఆలోచనలను రేపుతోంది.
ఇక తెలంగాణాలో చూస్తే తెలంగాణా వాదం ముందు ఏది అయిన బలాదూర్ అన్న అంచనా ఉండేది. దాని ముందు ఎంతటి బడా పార్టీలు వచ్చినా ఓటమి చెందేవి. మన తెలంగాణా అంటూ జనంలో ఎమోషన్స్ ని రగిలించి సొమ్ము చేసుకున్న తీరు కూడా బీఆర్ఎస్ ఎదుగుదలలో స్పష్టంగా కనిపించింది. ఇక ఎదురు లేదు అన్న పరిస్థితుల నుంచి బీఆర్ఎస్ ఓడి ఎక్కడో దూరంగా ఉండడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అని కూడా చర్చ సాగుతోంది.
ఏపీలో చూస్తే వైఎస్సార్ అన్న మూడు అక్షరాలు సెంటిమెంట్ గా మారి వైసీపీ రాజకీయ ప్రయాణానికి కావాల్సినంత ఇంధనాన్ని సమకూర్చి పెట్టాయి దాంతోనే ఇంతింతై అన్నట్లుగా ఎదిగి వైసీపీ 151 సీట్లతో అధికారం చేపట్టింది. అయితే 2024లో చూస్తే కేవలం 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావడం అంటే సెంటిమెంట్ అన్నది పూర్తిగా కరిగిపోయింది అని అంటున్నారు.
సహజంగా ఈ దేశ వాసులు సెంటిమెంట్ కి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. అది రాజకీయ పార్టీలకు పెట్టుబడిగా ఉంటూ వస్తోంది. అయితే దానినే పదే పదే ప్రయోగిస్తే వికటిస్తుందన్న సత్యాన్ని 2024 ఫలితాలు దేశ వ్యాప్తంగా చాటి చెప్పాయని అంటున్నారు.
పైగా ఎంతసేపూ సెంటిమెంట్ అంటూ పోతే డెవలప్మెంట్ అవసరం కూడా లేదా అన్నది జనం నుంచి వస్తున్న జవాబుగా ఉంది అని అంటున్నారు. అందుకే ఈసారి జనాలు ఎమోషన్స్ కి అసలు ఏ మాత్రం పడిపోలేదు. వాస్తవిక దృక్పథంతో అన్నీ ఆలోచించి ఓట్లు వేశారు. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే మాత్రం దేశంలో సెంటిమెంట్లకు ఎమోషన్లకు కాలం చెల్లినట్లే అంటున్నారు. నిజంగా అలాంటి రోజులు వస్తేనే అభివృద్ధి అజెండాతో పార్టీలూ ముందుకు వస్తాయని అంటున్నారు.