ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్న బీఆర్ఎస్ లో.. ఎమ్మెల్సీ 'సత్య' నిష్ట 'చెప్పు'కోదగ్గదే
సరే.. ఇదంతా కేసీఆర్ ఊహించినదే అనుకుందాం.. కానీ, ఒక ఎమ్మెల్సీ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 26 July 2024 1:30 AM GMTతెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఎమ్మెల్యేలు జంప్ కొట్టడం అనే కల్చర్ కొనసాగుతోంది. దీనిని పదేళ్ల పాటు (రెండు ఎన్నికల్లో) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రోత్సహించారు. అది ఇప్పుడు ఆయనకే ఎదురుతిరుగుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నెగ్గిన 38 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది అధికార కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. మరో 16 మందిని కూడా కాంగ్రెస్ పార్టీ లాగేస్తుందనే కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా వెళ్లిపోయారు. సరే.. ఇదంతా కేసీఆర్ ఊహించినదే అనుకుందాం.. కానీ, ఒక ఎమ్మెల్సీ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నారు.
అప్పుడు.. ఇప్పుడు చెప్పుల్లేకుండానే..
తెలంగాణలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొన్నేళ్ల నుంచి చెప్పులు ధరించడం లేదు. దీని వెనుక ఆమె పెద్ద కారణమే చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి సీఎం అయ్యాకనే తాను చెప్పులు వేసుకుంటానని ఆమె ప్రతిన బూనారు. దాదాపు 20 నెలల కిందట జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సమయంలో సత్యవతి ఈ శపథం చేశారని అంచనా. అయితే, ఆ తర్వాత బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ మాజీ సీఎం అయ్యారు. సత్యవతి మాత్రం చెప్పులు ధరించకుండానే ఉన్నారు.
మరో నాలుగున్నరేళ్లు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028 నవంబరులో జరిగే చాన్సుంది. అంటే.. ఇప్పటినుంచి చూస్తే మరో నాలుగున్నరేళ్లు. అప్పటివరకు కూడా సత్యవతి రాథోడ్ చెప్పులు ధరించరని స్పష్టం అవుతోంది. కాగా, సత్యవతి శాసన మండలి సభ్యురాలు. మండలి నుంచి మంత్రి అయిన మహిళ ఈమె ఒక్కరే. కేసీఆర్ రెండో విడత సర్కారులో సత్యవతి స్త్రీ,శిశు సంక్షేమం శాఖలు చూశారు.
సత్యవతి రాథోడ్ సెప్టెంబర్ 17 నుంచి దీక్ష చేపట్టారు. అప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్ హవా సాగుతోంది. గిరిజన సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేశారని.. 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారని.. అందుకే ఆయనంటే అభిమానమని సత్యవతి చెబుతారు. గిరిజన బంధు ప్రవేశపెట్టారని, ఊహించని విధంగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారని వివరిస్తారు.