మళ్లీ హెలికాప్టర్ లో లోపం.. టెన్షన్ పెట్టేస్తున్న కేసీఆర్ టూర్లు
అనంతరం హైదరాబాద్ కు తిరిగి వచ్చేందుకు హెలికాఫ్టర్ లోబయలుదేరగా.. చాపర్ మొరాయించింది.
By: Tupaki Desk | 16 Nov 2023 4:02 AM GMTఒకసారి జరిగితే తప్పు.. పొరపాటు అనుకోవచ్చు. కానీ.. అదే పనిగా తెర మీదకు వస్తున్న సాంకేతిక లోపాన్ని ఏమనాలి? అందునా అందులో ప్రయాణించేది సాదాసీదా వ్యక్తి కూడా కాదు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో ఒకరుగా అభివర్ణించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన వివిధ నియోజకవర్గాలకు ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్నారు. ఇలాంటి వేళ.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
తాజాగా ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ లో జరిగిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి వచ్చేందుకు హెలికాఫ్టర్ లోబయలుదేరగా.. చాపర్ మొరాయించింది. దీంతో కొద్దిపాటి ఆందోళన వ్యక్తమైంది. ఎన్నికల ప్రచారం మొదలైన ఈ కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కు సాంకేతిక లోపం తలెత్తటం ఇది మూడోసారిగా చెబుతున్నారు.
ఈ మధ్యన ఆయన మహబూబ్ నగర్.. అదిలాబాద్ లో జరిగిన ఎన్నికల సభలకు హాజరయ్యేందుకు హెలికాఫ్టర్ లో ప్రయాణించటం.. ఆ సందర్భంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో పదే పదే సాంకేతిక సమస్యలు చోటుచేసుకోవటం చూస్తే.. అసలేం జరుగుతోందన్న సందేహాం కలుగక మానదు. హెలికాఫ్టర్ సాంకేతిక సమస్యను సీరియస్ గా తీసుకోవాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసే కేసీఆర్.. తాను ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పదే పదే మొరాయిస్తున్ననేపథ్యంలో.. అందుకు బాధ్యులైన వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న హెలికాఫ్టర్ ను కంటిన్యూ చేయటంలోనూ అర్థం లేదని చెప్పాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఒక వివరణను విడుదల చేయాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది.