Begin typing your search above and press return to search.

విద్యుత్ ఒప్పందాలు : కేసీఆర్ వాదనలో నిజమెంత ?

కేసీఆర్ హయాంలో తెలంగాణలో అధికారంలో ఉన్న సమయలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టారు.

By:  Tupaki Desk   |   27 Jun 2024 7:30 AM GMT
విద్యుత్ ఒప్పందాలు : కేసీఆర్ వాదనలో నిజమెంత ?
X

కేసీఆర్ హయాంలో తెలంగాణలో అధికారంలో ఉన్న సమయలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టారు. దాంతో పాటు ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలు చేశారు. అధికధరకు విద్యుత్ కొనుగోలు చేసి అవతవకలకు పాల్పాడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందు కోసం జస్టిస్ ఎల్. నరసింహారెడ్డితో జ్యుడిషీయల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

అయితే విద్యుత్ కొనుగోలు, విద్యుత్ కేంద్రాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ జీవోను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనికి ముందు కేసీఆర్ ను కమిషన్ ముందు హజరు కావాలని జస్టిస్ ఎల్. నరసింహరెడ్డి కమిషన్ లేఖ రాసింది. ఈ నెల 19న కేసీఆర్ కు కమీషన్ నుండి లేఖ అందింది. వారం రోజుల్లోపుగా కమీషన్ ముందు హజరు కావాలని కోరింది. అయితే జూన్ 25తో వారం రోజుల గడువు పూర్తైంది. దీంతో మరోసారి కమిషన్ నుండి కేసీఆర్ కు లేఖ పంపారు. తన అభిప్రాయాలు చెప్పాలని ఆ లేఖలో కోరారు. కేసీఆర్ తో పాటు అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డికి కూడా కమిషన్ లేఖ రాసింది. అయితే అసలు కమిషన్ ఏర్పాటునే బీఆర్ఎస్ నాయకులు తప్పుబడుతున్నారు.

విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా, ఒప్పందాలు, వివాదాలు అన్నీ విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోనే ఉంటాయని కేసీఆర్ చెబుతున్నారు. జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదన్నది బీఆర్ఎస్ వాదన. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ చట్టంలోని 61, 62, 86 సెక్షన్లకు విరుద్దంగా ఈ జీవో ఉందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని జ్యుడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఛత్తీస్ గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఈఆర్సీలోనే తన అభ్యంతరాలను వ్యక్తం చేశారని ఈ సంధర్భంగా గుర్తు చేస్తున్నారు.

ఛత్తీస్ గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు విషయమై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిని విచారణ కమిషన్ నుండి తప్పుకోవాలని కోరుతూ కేసీఆర్ ఈ నెల 15న లేఖ రాశారు. తొమ్మిదిన్నర ఏళ్లలో విద్యుత్ రంగంలో చేసిన కృషిని ప్రస్తావించారు. అప్పట్లో తెలంగాణలో ఉన్న విద్యుత్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో పీపీఏ చేసుకున్నట్టుగా వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని తప్పుబట్టే విధంగా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ మాట్లాడడంపై లేఖలో కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ను దామరచర్లలో ఏర్పాటు చేయడానికి గల కారణాలను వివరించారు. విచారణ పూర్తి కాకుండానే మీడియా సమావేశంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టేలా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి మాట్లాడడాన్ని తప్పుపట్టారు. విచారణ కమిషన్ నుండి తప్పుకోవాలని జస్టిస్ ఎల్. నరసింహరెడ్డిని ఆయన కోరారు.

ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో అవతవకలు ఎలా ఉంటాయని, ఈ లెక్కన అప్పటి చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు కూడా నోటీసులు ఇవ్వాలన్నది బీఆర్ఎస్ వాదన. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటీషన్ మీద హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతున్నది.