కేసీయార్లో మేడిగడ్డ టెన్షన్ పెంచేస్తోందా ?
కారణమేదైనా మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగటం అన్నది రాబోయే ఎన్నికల్లో పెద్ద అంశంగా మారబోతోంది అన్నదిమాత్రం వాస్తవం.
By: Tupaki Desk | 25 Oct 2023 7:00 AM GMTపార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికలు మరో నెలరోజులుండగా మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగిపోవటం ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఎప్పుడైతే బ్యారేజి పిల్లర్ కుంగిందో వెంటనే బ్యారెజీ కూడా కుంగిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. పిల్లర్ కుంగిపోవటానికి సరైన కారణాలు ఏమిటో ఇంతవరకు తెలీలేదు. ఇదే విషయమై పరిశీలనకు కేంద్ర బృందం కూడా వచ్చింది.
కారణమేదైనా మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగటం అన్నది రాబోయే ఎన్నికల్లో పెద్ద అంశంగా మారబోతోంది అన్నదిమాత్రం వాస్తవం. ఇపుడీ అంశంపైనే మంత్రులు, ఎంఎల్ఏలు, అభ్యర్ధులు, పార్టీ నేతలకు కేసీయార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మేడిగడ్డ అంశంపై ఎవరూ పొరబాటున కూడా ఎక్కడా మాట్లాడద్దని కేసీయార్ ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా నోరు విప్పవద్దని, మీడియా ఎంతడిగినా ఎవరూ సమాధానాలు చెప్పవద్దని కేసీయార్ చాలా స్పష్టంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతోనే మేడిగడ్డ ఇష్యూ కేసీయార్లో ఎంత టెన్షన్ పెంచేస్తోందో అర్ధమైపోతోంది.
బ్యారేజి ఇష్యూని పెద్ద ప్రచారాస్త్రంగా చేసుకోవాలని ఇప్పటికే ప్రతిపక్షాలు నిర్ణయించాయి. బ్యారేజి నిర్మాణంలో కేసీయార్ భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలతో రెచ్చిపోతున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణలను ఏ విధంగా తిప్పికొట్టాలో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. ఇరిగేషన్ శాఖ కూడా కేసీయార్ ఆధ్వర్యంలోనే ఉండటంతో ఈ విషయంపై స్పందించేందుకు మంత్రులు, ఎంఎల్ఏలు కూడా భయపడుతున్నారు. దీనికి అదనంగా తాజాగా కేసీయార్ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.
అధికారులేమో బ్యారేజి కుంగటం వెనుక విద్రోహచర్యే కారణమని చెబుతున్నారు. ముందు భారీ శబ్దం వచ్చిందని తర్వాత బ్యారేజి పిల్లర్ కుంగిందని ప్రాజెక్టు ఈఈ మహదేవ్ పూర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే ప్రాజెక్టు దగ్గర నిరంతర నిఘా ఉన్నపుడు విద్రోహ చర్య ఎలా సాధ్యమనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్లో లోపం కారణంగానే బ్యారేజి పిల్లర్ కుంగిందని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అధ్యక్షుడు దొంతుల లక్ష్మీనారాయాణ ప్రకటించారు. మొత్తానికి మేడిగడ్డ టెన్షన్ కేసీయార్లో పెరిగిపోతోందన్నది వాస్తవం అని తేలిపోయింది.