Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ అస్త్రం తీసిన కేసీఆర్... వర్కౌట్ అయ్యేనా...!?

సెంటిమెంట్ అన్నది రాజకీయాల్లో వర్కౌట్ అవుతుంది అని అంటారు. అది భావోద్వేగం. ఒక్కసారి ఉప్పెనలా పొంగుతుంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 3:45 AM GMT
సెంటిమెంట్ అస్త్రం తీసిన కేసీఆర్... వర్కౌట్ అయ్యేనా...!?
X

సెంటిమెంట్ అన్నది రాజకీయాల్లో వర్కౌట్ అవుతుంది అని అంటారు. అది భావోద్వేగం. ఒక్కసారి ఉప్పెనలా పొంగుతుంది. అలా తెలంగాణా ఉద్యమ సమయంలో ఉవ్వెత్తిన లేచింది. ఎగబాకింది. అలా ఉద్యమ కాలంలో కేసీఆర్ అత్యంత శక్తిమంతుడిగా నిలిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతొనే పోరాడారు.

ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్దగా లేకపోయినా ఆయన బలం అంతా ఉద్యమ బలంగా ఉంటూ వచ్చింది. ఏ రాజకీయ పార్టీ ఆయనని కాదనే చాన్స్ లేదు. ఆయనని విమర్శించాలంటే కూడా భయపడే సీన్ ఉంది. ఎందుకంటే తెలంగాణానే ధిక్కరిస్తున్నట్లుగా లెక్కగా చూసేవారు.

అలా కేసీఆర్ శకం నడచింది. మొత్తానికి తెలంగాణా వచ్చింది. దాని ఫలాలను ఫలితాలను కూడా కేసీఆర్ రెండు సార్లు సీఎం గా అనుభవించారు. ఇపుడు కాంగ్రెస్ ని జనాలు ఎన్నుకున్నారు. రెండు నెలల పాటు గమ్మున ఉన్న కేసీఆర్ ఇపుడు జనంలోకి వచ్చారు. నల్గొండలో నిర్వహించిన భారీ సభలో ఆయన తెలంగాణా సెంటిమెంట్ ని మళ్లీ రగిలించే ప్రయత్నం చేశారు.

క్రిష్ణా జలాల పరిరక్షణ కోసం అంటూ సాగిన ఈ సభ కేసీఆర్ పూర్తిగా తన రాజకీయ కార్యాచరణకు వేదికగా చేసుకున్నారు. కేసీఆర్ అంటే తెలంగాణా అని ఆయన నినదించారు. నేను తెలంగాణాను తెచ్చాను అన్నారు. నీళ్ళు లేకపోతే తెలంగాణా లేదు అన్నారు. తాను పాతికేళ్ళుగా నీటి హక్కుల కోసం పోరాడుతున్నాను అని కూడా చెప్పారు.

తనను తెలంగాణాలో తిరగనీయమని అంటున్నారు అని కేసీఆర్ మరో విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేశారు. తనను చంపాలనుకుంటున్నారా అని కూడా అన్నారు. తనది తెలంగాణా కట్టె కాలేవరకూ తెలంగాణా కోసమే తాను ఉంటాను అని భీషణ ప్రతిన చేశారు.

దీనిని బట్టి చూస్తే తెలంగాణా సెంటిమెంట్ నే మరోసారి గులాబీ సార్ నమ్ముకున్నారని అర్ధమవుతోంది. ఆయన చెప్పినట్లుగా తెలంగాణా సాధనలో కేసీఆర్ కి ఎక్కువ వాటా ఉంది. ఆయన ఉద్యమాన్ని ఎవరూ కాదనలేదు, ఆయన తెలంగాణా నినాదాన్ని తప్పుపట్టడంలేదు.

ఆయన పదేళ్ళ పాలన తరువాత మార్పు కోసం కాంగ్రెస్ కి చాన్స్ ఇచ్చారు. ఆ ప్రభుత్వం పాలన చూసిన మీదట ప్రజలు మరో ఎన్నికల్లో నిర్ణయం తీసుకుంటారు. ఇంతలో సెంటిమెంట్ రాజేసినా ఫలితం ఉండదని అంటున్నారు. ఇక త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల కోసమే కేసీఆర్ బయటకు వచ్చారు అని అంటున్నారు.

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోకపోతే ఇబ్బందులలో పడుతుంది అన్నది వాస్తవం. అయితే ఈసారి కూడా కాంగ్రెస్ హవా ఉండవచ్చు అని సర్వేలు చెబుతున్నాయి. వాటిని తట్టుకుని కనీసంగా అరడజన్ సీట్లు అయినా బీఆర్ ఎస్ తెచ్చుకోగలదా అన్నదే చూడాలి.

ఏది ఏమైనా తెలంగాణా రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ పాలన కూడా జనాలు చూసారు కాబట్టి ప్రజా సమస్యల మీద అది కూడా నిర్మాణాత్మకమైన పంధాలో పోరాటం చేయాలి. దానికంటే ముందు కొన్నాళ్ళు కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా సెంటిమెంట్ ని రగిలించినా ప్రయోజనంలేదు అనే అంటున్నారు ఇందిర అంటే ఇండియా అని గొప్పగా చెప్పించుకున్న ఇందిరమ్మ 1977లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయిన సంగతి చరిత్రలో పదిలంగా ఉంది అన్నది అంతా గుర్తుంచుకోవాలి.