Begin typing your search above and press return to search.

4 గంటల ఇంటర్వ్యూ కేసీఆర్ కు లాభమా? నష్టమా?

రోటీన్ రాజకీయ నాయకుడికి భిన్నంగా గులాబీ బాస్ కేసీఆర్ తీరు ఉంటుంది.

By:  Tupaki Desk   |   25 April 2024 6:30 AM GMT
4 గంటల ఇంటర్వ్యూ కేసీఆర్ కు లాభమా? నష్టమా?
X

రోటీన్ రాజకీయ నాయకుడికి భిన్నంగా గులాబీ బాస్ కేసీఆర్ తీరు ఉంటుంది. ఒక పార్టీ అధినేతగా ఆయన తీరు మిగిలిన వారికి ఏ మాత్రం సూట్ కాదనే చెప్పాలి. రాజకీయాల్లో ఉన్న వారు అందరికి అందుబాటులో ఉండటం సాధారణంగా జరిగేది. అందుకు భిన్నంగా.. ఎవరికి అందుబాటులో ఉండకుండా తనదైన ప్రపంచంలో ఉండటం.. అవసరమైతే తప్పించి ప్రజల్లోకి రాకపోవటం లాంటి కేసీఆర్ తీరు తెలుగు ప్రజలకు సుపరిచితం. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ.. ప్రజల్లో తమకు పట్టు తప్పలేదని.. తన మాటలకు తెలంగాణ ప్రజలు ఇంకా విశ్వసిస్తున్నారన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. తాజా ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తున్నారు కేసీఆర్.

సార్వత్రిక ఎన్నికల్లో ఐదుకు మించిన స్థానాల్లో పార్టీ గెలిస్తే.. రాష్ట్ర రాజకీయ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునే వీలుందంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ టీవీ చానల్ స్టూడియోకి వెళ్లి మరీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్.. సదరు ఇంటర్వ్యూను నాలుగు గంటల పాటు సాగించటం ఒక విశేషం. ఒక ప్రముఖ న్యూస్ చానల్ ఒక రాజకీయ అధినేత ఇంటర్వ్యూను నాలుగు గంటల పాటు ప్రసారం చేసిందంటే.. దానికి వచ్చే మైలేజీ ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఆన్ లైన్ లో కేసీఆర్ ఇంటర్వ్యూను లైవ్ లో దాదాపు 95వేలకు పైనే వీక్షకులు వీక్షించారన్న డేటాతో పాటు..పలు గ్రామాల్లో ఇంటర్వ్యూను గ్రామస్తులు చూసేందుకు వీలుగా.. పెద్ద తెరల్ని ఏర్పాటు చేసి.. అందరిని చూడాలని ఆదేశించటం.. అందుకు తగ్గట్లుగా గులాబీ సైన్యం ఏర్పాట్లు చేయటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఈ సుదీర్ఘ ఇంటర్వ్యూతో కేసీఆర్ కు మైలేజీ ఎంత వచ్చింది? అసలు లాభమా? నష్టమా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాజకీయ.. మీడియా వర్గాల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటే.. తాజా ఇంటర్వ్యూ ఒకింత నష్టమే వాటిల్లేలా చేసిందంటున్నారు. దీనికి కారణం.. ఆయన వ్యవహార శైలి.. ప్రశ్నలు వేస్తున్న జర్నలిస్టుతో.. మీరు నన్ను అడ్డుకోకండి.. ఫ్లో పోతుందంటూ డిక్టేట్ చేయటం.. నిందారోపణలు.. అహంకారాన్ని ప్రదర్శించటమే తప్పించి.. ఓపెన్ గా మాట్లాడినట్లు లేకపోవటం నెగిటివ్ గా మారిందంటున్నారు. నిజానికి ఇలాంటి ఇంటర్వ్యూల వేళ.. తన మార్పు కొట్టొచ్చినట్లుగా వచ్చిందన్న భావనను వ్యాపించేలా చేస్తుంటారు.

కానీ.. కేసీఆర్ మాత్రం ఆ అంశాన్ని పట్టించుకోలేదు. ఎప్పటిలానే తాను ఉన్నానని.. తన తీరులో రవ్వంత మార్పు లేదన్న విషయాన్ని ఆయన తన తీరుతో ప్రదర్శించారు. సాగునీరు.. విద్యుత్ విషయంలో ఎప్పటిలానే తన గొప్పలు చెప్పుకోవటం.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవటాన్ని చాలా చిన్న అంశంగా కొట్టి పారేయటం లాంటి అంశాలు ఆయన ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉన్నాయని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రజలు ఓటుతో తిరస్కరించిన వేళ.. తమ పదేళ్ల పాలనలో జరిగిన కొన్ని తప్పుల్ని రేఖా మాత్రంగా ప్రస్తావించి.. వాటిని సరిదిద్దుకున్నామన్న మాటే లేకపోవటం నెగిటివ్ గా మారిందని చెప్పాలి.

చెప్పిన విషయాన్నే.. పదే పదే చెప్పటం లాంటివి బోరింగ్ కలిగించేలా మారాయని అంటున్నారు. ఇంటర్వ్యూ మొత్తాన్ని అసాంతం చూసినోళ్లంతా ఒక్కమాట మాత్రం అనుకున్నారు. అదేమంటే.. ఇదే కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉంటే.. సదరు టీవీ చానల్ వంక చూసేవారా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా వ్యవహరించే తీరు సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.