రేవంత్ తో అదొక్కటే పంచాయితీ.. ఇంకేం లేదన్న కేసీఆర్!
తాను మాత్రమే కరెక్టు అన్నట్లుగా ఆయన వ్యవహరించిన వైఖరి.. ఆయనలోని అహంభావాన్ని ఇంకా తగ్గలేదన్న విషయాన్ని తాజా ఇంటర్వ్యూ మరోసారి స్పష్టం చేసింది.
By: Tupaki Desk | 24 April 2024 4:28 AM GMTఒక ప్రముఖ చానల్ లో ఇంటర్వ్యూ కోసం వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బోలెడన్ని అంశాల్ని ప్రస్తావించారు. తన ఎజెండాకు తగ్గట్లే ఇంటర్వ్యూను నడిపిన ఆయన.. ప్రసంగ ధోరణికి బ్రేకులు వేసే ప్రయత్నాల్ని తనదైన శైలిలో అడ్డుకోవటమే కాదు.. ఎప్పటిలానే జర్నలిస్టులు అన్నంతనే ఏదో ఒక మాట అనేసే తీరును కేసీఆర్ ఇంకా వదిలించుకోలేదు. తాను మాత్రమే కరెక్టు అన్నట్లుగా ఆయన వ్యవహరించిన వైఖరి.. ఆయనలోని అహంభావాన్ని ఇంకా తగ్గలేదన్న విషయాన్ని తాజా ఇంటర్వ్యూ మరోసారి స్పష్టం చేసింది.
రేవంత్ కు భజన మీడియా అంటూ కొన్ని మీడియా సంస్థలను పదే పదే మాటలు అన్న కేసీఆర్.. తనకు వినమ్రతతో వ్యవహరించే చానళ్లు కూడా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా వ్యవహరించారు. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో కేసీఆర్ తరహా వైఖరిలోని లెక్కలు ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. తన ప్రాధాన్యత అంశాలైన కరెంటు.. నీళ్ల మీద సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన..పలుమార్లు దొరికిపోయారు.
తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డలోని మూడు పిల్లర్ల కుంగుబాటు అంశాన్ని చాలా చిన్నదిగా తేల్చేసిన ఆయన.. రూ.200 కోట్లు ఖర్చు చేసేస్తే సరిపోతుందని తేల్చారు. కాంగ్రెస్ మీదా.. రేవంత్ మీదా నిప్పులు చెరిగిన కేసీఆర్.. ఇంతకూ ఆయనకు మీకు మధ్య ఉన్న పంచాయితీ ఏమిటన్న ప్రశ్నకు కేసీఆర్ స్పందించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో తమ ప్రభుత్వాన్ని ఆస్థిరపరిచేందుకు తమ ఎమ్మెల్యే (నామినేటెడ్) స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారని.. అదే తన మీద రేవంత్ కున్న కోపంగా చెప్పుకొచ్చారు.
ఓటుకు నోటు కేసును మళ్లీ తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్.. రేవంత్ ను మరింత ఎక్కువగా కెలికారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో.. ఓటుకు నోటు కేసు మొత్తం కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ తో పాటు.. మాజీ మంత్రి ఎర్రబెల్లిదయాకర్ రావు ఉప్పందించటంతోనే ఈ ఇష్యూ బయటకు వచ్చిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. మొత్తంగా చూస్తే.. రేవంత్ ను టార్గెట్ చేసిన కేసీఆర్.. ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.