కర్మ బాగోలేక కాంగ్రెస్ లోకి వెళ్లాడు
టీవీ9 ఛానల్ లో 'లైవ్ షో విత్ కేసీఆర్' కార్యక్రమం ద్వారా దాదాపు 3 గంటల పాటు ఆయన అనేక అంశాలను ప్రజలతో పంచుకున్నారు.
By: Tupaki Desk | 24 April 2024 4:50 AM GMT''కడియం శ్రీహరి తాను చచ్చి బీఆర్ఎస్ పార్టీని బతికించాడు. ఆయన ఖర్మ బాగోలేక కాంగ్రెస్ లోకి వెళ్లాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని స్వేచ్చ అధికారం పోయాక గుర్తుకు వచ్చిందా ?, బీఆర్ఎస్ మహా సముద్రం. పిడికెడు మంది పోతే అయ్యేదేం లేదు. ఫక్తు రాజకీయాలు చేస్తామని 2014కు ముందే చెప్పాం. పార్టీ నుండి వెళ్లిపోయిన వారు తిరిగి నాకు ఫోన్లు చేస్తున్నారు’’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. టీవీ9 ఛానల్ లో ‘లైవ్ షో విత్ కేసీఆర్’ కార్యక్రమం ద్వారా దాదాపు 3 గంటల పాటు ఆయన అనేక అంశాలను ప్రజలతో పంచుకున్నారు.
ఓటుకు నోటు కేసు తప్ప తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన మీద మరే కక్ష లేదని, 2015లో ఓటుకు నోటు ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రేవంత్ కుట్ర చేశారని, ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బయట అనేకమంది చెబుతుంటే రేవంత్ రెడ్డి ఖండించడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే అనిశ్చితి ఉందని, కొంత మంది ఎమ్మెల్యేలు తమ నేతలను సంప్రదిస్తున్నారని, దాదాపు 20, 25 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు వస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని చెబుతున్నా తాము ఆ విషయం గురించి ఇంత వరకు చర్చించలేదని కేసీఆర్ స్నష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని పలు మార్లు మీడియా సాక్షిగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కేసీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గత కొన్నాళ్లుగా ప్రతి వేదిక మీద రేవంత్ ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నాడు. పండబెట్టి తొక్కుకుంటూ పార్లమెంటుకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీకి పంపుతాం అని హెచ్చరికలు చేస్తున్నాడు. అంతర్గతంగా పార్టీలో ఉన్న సంక్షోభం కారణంగానే రేవంత్ ఈ తరహా దూషణలకు పాల్పడుతున్నాడని రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి.